Top

పదేళ్లలో ఎన్నడూ చూడని కృష్ణమ్మ జలకళ

పదేళ్లలో ఎన్నడూ చూడని కృష్ణమ్మ జలకళ
X

గత దశాబ్దకాలంలో ఎన్నడూ చూడని విధంగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. 8లక్షల క్యూసెక్కులపైగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో మొత్తం 64 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ వరద మొత్తం శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చి చేరుతోంది.. దీంతో శ్రీశైలం డ్యామ్‌ నిండు కుండను తలపిస్తోంది.. ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.. గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 880 అడుగులు దాటింది.. నీటి నిల్వ 190 టీఎంసీలకు చేరుకుంది.. పది గేట్లను 38 అడుగుల మేర ఎత్తిన అధికారులు కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల ద్వారా 60వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.. హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 28వేల క్యూసెక్కులు డ్యామ్‌ గేట్ల ద్వారా 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ఇక నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద పోటెత్తుతోంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 525 అడుగులకు చేరింది.. పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 153 టీఎంసీలుగా ఉంది. దీంతో నాగార్జున సాగర్‌ నుంచి రైట్‌ కెనాల్‌లోకి 6 వేల 766 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తెలంగాణ మంత్రి జగదీష్‌ రెడ్డి, ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలిసి నీటిని విడుదల చేశారు‌. నీటి విడుదల కార్యక్రమానికి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలు సాకారం అవుతున్నాయని అన్నారు తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి.

మరోవైపు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామలను వరద చుట్టుముడుతోంది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో శివాలయం, రామాలయం నీటమునిగాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో యాక్టాపూర్, బీచ్‌పల్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలంపూర్ ఆలయం దగ్గర కృష్ణా బ్యాక్ వాటర్ భయపెడుతోంది. అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

2009 తరువాత మళ్లీ కృష్ణా నదికి అంతటి స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్‌, ముచ్చుమర్రి, సంకిరేణిపల్లె, గణపురం గ్రామాలకు వరద అతిసమీపంలో వచ్చింది. కేవలం 100మీటర్ల దూరంలోనే కృష్ణమ్మ పోటెత్తుతోంది.

కృష్ణా నదికి ఎగువ నుంచి వరద నీరు పోటెత్తటంతో అనంతపురం జిల్లా ప్రజల ముఖాల్లో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. గుంతకల్లు ఉరవకొండ ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగానో కృష్ణా నీటి కోసం వేచిచూస్తున్నారు. ప్రస్తుత వరదతో ఆదివారం నాటికి నదీ జలాలు అనంతపురం సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. దీంతో కాలువలోకి దిగి కృష్ణమ్మకు పూజలు చేశారు రైతులు. ప్రవాహ తీవ్రత ఇదే స్థాయిలో కొనసాగితే సోమవారం సాయంత్రానికి రాగులపాడు దగ్గర లిఫ్ట్ ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయి.

Next Story

RELATED STORIES