కృష్ణమ్మ పరవళ్లు.. నిండు కుండలులా ప్రాజెక్టులు

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో... కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బిరబిరా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ....శ్రీశైలం జలాశయానికి అటునుంచి నాగార్జున సాగర్‌ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో... తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో దిగువకు 2 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. మంత్రాలయం వద్ద తుంగభద్ర ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భక్తులు ఎవరూ పుణ్యస్నానాలకు వెళ్లకూడదని హెచ్చరించారు

జోగాలాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో ... తుంగభద్ర వరద కారణంగా.. పలు గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఇప్పటికే బీచ్‌పల్లి ఆలయం మునిగిపోయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. తుంగభద్ర నదీ తీరాన ఉన్న... కూటకనూరు, రాజపూర్‌, వేణి సొంపురం, గార్లపాడు, తమ్మిళ్ల , రాజోలి, సుల్తానాపురం తదితర గ్రామాల ప్రజల్ని అలర్ట్‌ చేశారు అధికారులు.

కృష్ణా బేసిన్‌ జూరాల నుంచి 9 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర బేసిన్‌ సుంకేసుల నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు చేరుకుంటోంది. భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వస్తుండటంతో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లును 42 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్ద ఇన్‌ఫ్లో దాదాపు 11 లక్షల క్యూసెక్కులు కాగా.. అవుట్‌ ఫ్లో.. 9 లక్ష క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా...ప్రస్తుతం 180 టీఎంసీలు ఉంది.

మరోవైపు.... నాగార్జునసాగర్‌కు భారీ వరద నీరు చేరుకోవడంతో... ప్రాజెక్ట్‌ మొత్తం గేట్లను ఎత్తివేశారు అధికారులు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో-8.20 లక్షల క్యూసెక్కులు వస్తోంది. దీంతో 26 గేట్లు ఎత్తి 2.20 లక్షల క్యూసెక్కులు విడుదల విడుదల చేస్తున్నారు. సాగర్‌కు భారీగా వరద రావడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో సాగర్‌ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 562 అడుగులు ఉంది. సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు, ప్రస్తుతం 237 టీఎంసీలు ఉన్నాయి.అటు.... సూర్యాపేట జిల్లా హూజుర్‌ నగర్‌ పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు ఉద్ధృతంగా వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్ట్‌ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ. 2.99 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 48100 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ ఫ్లో 12 వేల 300 క్యూసెక్కులుగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story