Top

మీ అవగాహనా రాహిత్యానికి ఎన్నిరోజులు ఇబ్బందులు పడాలి : నారా లోకేష్

మీ అవగాహనా రాహిత్యానికి ఎన్నిరోజులు ఇబ్బందులు పడాలి : నారా లోకేష్
X

ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షనేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఓటు వేయలేదనే కారణంతో టీడీపీ సానుభూతిపరులను టార్గెట్‌ చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఇది తగదని అన్నారాయన. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని జనార్దనరెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ కార్యకర్తల ఇళ్లు కూల్చేయడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ నాయకుల ఇళ్ల కూల్చివేతకు రంగం సిద్ధమైందనే పేపర్ కటింగ్‌ను చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇకనైనా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కూడా ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు.. ట్విట్టర్‌ వేదికగా పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని లోకేష్‌ సెటైర్లు వేశారు.. గుక్కెడు నీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మన నీళ్లు తెలంగాణకు తరువాత ఇవ్వొవచ్చని, ముందు రాయలసీమ వాసులకు తాగేందుకు నీళ్లు ఇవ్వమని లోకేశ్‌ ప్రభుత్వానికి సూచించారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉంటే జలవాణి కార్యక్రమం ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసి మంచి నీరు సరాఫరా చేశామని గుర్తు చేశారు. మీ అవగాహనా రాహిత్యానికి ప్రజలు ఇంకెన్నాళ్లు ఇబ్బందులు పడాలంటూ నారా లోకేష్ ఘాటుగానే ప్రశ్నించారు.

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు.. టీడీపీ వర్గీయులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు ఇసుక కొరతను ప్రభుత్వమే సృష్టించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. నూతన ఇసుక విధానం రాకముందే వైసిపి నేతలను కుబేరులను చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనబడుతోందని టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర అన్నారు. ఇసుక కొరతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇసుక కొరత కారణంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. సిమెంట్‌ కంపెనీలు బస్తాకు 5 రూపాయల చొప్పున ఇవ్వాలని వైసిపి చతుష్టయం డిమాండ్‌ చేసింది నిజం కాదా అని వారు ప్రశ్నించారు. రద్దుల ప్రభుత్వం త్వరలో మీ సేవ కేంద్రాలకు మంగళం పాడాలని చూస్తోందన్నారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

అటు రాష్ట్రంలో రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి.. కర్నూలు జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని మాధవరం గ్రామంలో ఇస్మాయిల్‌ అనే టీడీపీ కార్యకర్తపై వైసీపీకి చెందిన అల్లం బాషా సహా ముగ్గురు దాడి చేశారు.. ప్రత్యర్థుల దాడిలో ఇస్మాయిల్‌కు తలకు బలమైన గాయాలయ్యాయి.. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

Also Watch :

Next Story

RELATED STORIES