గ్రామ వాలంటీర్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన ఏపీ ప్రభుత్వం..

గ్రామ వాలంటీర్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఇకపై ఏపీలో ప్రభుత్వ పథకాలకు అర్హులెవరో తేల్చిది గ్రామ వాలంటీర్లేనా? వారు నిర్ణయిస్తేనే లబ్దిదారులుగా ఎంపికవుతారా? అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం... ఇప్పుడు వారికి కొత్త అధికారాలను కట్టబెడుతోది. ఇకపై గ్రామాల్లో ప్రభుత్వ పథకాలకు అర్హులెవరో తేల్చేది గ్రామ వాలంటీర్లే. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించేందుకు ఈ నెల 26 నుంచి సర్వే చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ బాధ్యతలను గ్రామ వాలంటీర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు అవసరం అన్నదానిపై గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ నెల 26 నుంచి రాష్ట్రమంతటా సర్వే చేయనున్నారు. అలాగే వైఎస్సార్‌ చేయూత పథకంలో వివిధ కార్పోరేషన్ల ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత ఉన్న... 45 నుంచి 60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను గుర్తించడం.. రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా ద్వారా లబ్ధిపొందే వారి వివరాలపై ఈ సర్వే నిర్వహిస్తారు. ఒకొక్క వాలంటీరు తనకు కేటాయించిన 50 ఇళ్లలో రోజుకు ఏడు నుంచి పది ఇళ్ల చొప్పున ఐదు రోజుల పాటు సర్వే చేస్తారు. ఆగస్టు 15న వాలంటీర్లు విధులలో చేరిన తర్వాత అక్టోబరు 2న గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే వరకు 45 రోజుల పాటు వారు ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న సీఎం జగన్‌ విజయవాడ నుంచి ప్రారంభిస్తారు.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు కాదంటూ వైసీపీ కార్యకర్తలుగా ఉన్న వారిని గ్రామ వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీని ద్వారా అసలైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతుందన్న వాదన తెరపైకి తెస్తున్నారు. ఈ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. 4 లక్షల మంది వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి... 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి వారి పొట్ట కొట్టే భారీ కుట్రే వైసీపీ వాలంటీర్ల స్కాం అన్నారు. వైఎస్‌ జగన్‌ స్కాం స్టార్‌ అని ఆధారాలతో సహా రుజువైందన్న లోకేష్‌..గ్రామ వాలంటీర్ల స్కాంతో 12 వేల కోట్ల దోపిడీకి తెరలేపారని మండిపడ్డారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకం అని జగన్‌ ఆస్కార్‌ రేంజ్‌లో నటిస్తుంటే... కడుపులో దాచుకోలేక వైసీపీ స్కామ్‌ దొంగ లెక్కల వీరుడు బయట కక్కేశాడు అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story