మృత్యువాత పడిన గోశాలను సందర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌

మృత్యువాత పడిన గోశాలను సందర్శించిన ఎమ్మెల్యే రాజాసింగ్‌

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 86 గోవులు ఒకేసారి మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడలోని తాడేపల్లిలో ఆవులు మృత్యువాత పడిన గోశాలను గోశామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సందర్శించారు. పచ్చగడ్డిలో కెమికల్‌ కలిసి ఉంటే ఒకటి, రెండు చనిపోతాయి కానీ ఇన్ని ఆవులు ఎలా చనిపోతాయని ప్రశ్నించారు. దీని వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు రాజాసింగ్. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి సమీపంలో కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నారు. ఈ స్థలం సరిపోకపోవడంతో కొత్తూరు తాడేపల్లిలో మరో గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ పది షెడ్లు, మూడు బ్యారక్‌ల్లో సుమారు 1500 ఆవులు ఉన్నాయి. కమిటీ సభ్యులు కొన్నాళ్ల కిందటి వరకు విజయవాడలో దాణాను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పచ్చగడ్డి తెప్పించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఎప్పటిమాదిరిగానే గోవులకు పచ్చగడ్డి వేశారు. అవి తిన్న ఆవులు తిన్నట్టే నిలబడిన చోటే కుప్పకూలాయి...నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చి మృత్యువాత పడ్డాయి. మొత్తం 128 గోవులు అస్వస్థతకు గురవగా.. అందులో 86 మృతి చెందాయి.

ఆవుల మృతిపై తీవ్ర విమర్శలు చెలరేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది..ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ సిట్‌ పనిచేయనుంది. ఇందులో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు సభ్యులుగా ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారం..గోవులకు వేసిన పచ్చగడ్డిలో కెమికల్ కలవడం వల్లే ఆవులు మృతి చెందాయని భావిస్తున్నారు. అయితే ఆ గడ్డిలో కెమికల్ ఎలా కలిసింది? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా అన్నది సిట్ తేల్చనుంది.

Tags

Read MoreRead Less
Next Story