పదేళ్ల తర్వాత ఉప్పొంగిన కృష్ణానది.. ఆ జిల్లా ప్రజల్లోమాత్రం ఆందోళన

పదేళ్ల తర్వాత ఉప్పొంగిన కృష్ణానది.. ఆ జిల్లా ప్రజల్లోమాత్రం ఆందోళన

అటు కృష్ణా, ఇటు తుంగభద్ర నదులు మహోగ్ర రూపం దాల్చడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వణుకుతోంది.. రెండు నదులూ ఉప్పొంగి ప్రవహిస్తూ జిల్లాపై ముప్పేట దాడి చేస్తున్నాయి.. నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది.. అలంపూర్‌ గొందిమల్లంలో ఉన్న కృష్ణ, తుంగభద్ర సంగమం వద్ద రెండు నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలైన ఉండవెల్లి మండలం పుల్లూరు, కలకోట్ల, మిన్నిపాడు, అలంపూర్‌ మండలంలో అలంపూర్, సింగవరం, మానవపాడు మండలం కొరివిపాడు, మద్దూరు, రాజోలి మండలంలో రాజోలి, తూర్పుగార్లపాడు, పడమటి గార్లపాడు, అయిజ మండల పరిధిలోని పుట్కనూరు, రాజాపురం, వేణిసోంపూర్‌ గ్రామాలకు వరద పోటెత్తుతోంది.

అటు కృష్ణా ప్రవాహానికి బీచుపల్లి పుణ్యక్షేత్రం దగ్గర శివాలయంతోపాటు రామాలయం నీట మునిగింది. పంచదేవ్‌పహాడ్‌ వద్ద ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలోకి వరద వచ్చింది. చింతరేవుల–భీంపురం అదే మండలం బీరోలు, గుర్రంగడ్డ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు మండలంలోని రేచింతలకు రాకపోకలు నిలిచాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నారాయణపేట్‌ జిల్లా కృష్ణ మండలంలో వరద ముపునకు గురైన హిందూపూర్‌ గ్రామంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కృష్ణ మండలంలోని పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లా సిబ్బంది సహకారంతో ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతల్లో తగిన సంఖ్యలో షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

జూరాల ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి మరింత పెరగడంతో వనపర్తి జిల్లాలో పంట పొలాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. గద్వాల మండలం రేకులపల్లి గ్రామశివారులో లోయర్‌ జూరాల కారణంగా 200 ఎకరాల పండ్ల తోటలు, పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. నారాయణపేట జిల్లా కృష్ణా పరీవాహక మండలాల్లో 4 వేలకు పైగా ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. కృష్ణ, మాగనూరు మండలాల పరిధిలోని వాసునగర్, హిందూపూర్, మొరహరిదొడ్ది, ముడుమాలు, తంగిడి, పుంజనూరు, మందిపల్లి, కొల్పూరు, గుడెబల్లూరులో 5 వేల ఎకరాల్లో పంట మునిగింది. పంట నష్టపోయిన ప్రాంతాల్లో స్థానిక నాయకులు పర్యటించారు.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పదేళ్ల తర్వాత కృష్ణానది వరద మళ్లీ ఆ స్థాయిలో పోటెత్తుతుండటంతో జిల్లా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.. జూరాలకు వస్తున్న వరదను చూసి 2009 చేదు అనుభవాలు పునరావృతం అవుతాయేమోనన్న భయం అందరిలోనూ నెలకొంది.. ఇక జూరాలకు వరద అంతకంతకూ పెరుగుతుండటంతో నారాయణపేట, గద్వాల జిల్లా కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు.

Also Watch :

Tags

Read MoreRead Less
Next Story