Top

ఆ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి

ఆ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి
X

ఇప్పటివరకూ గోదావరి నీటితో కళకళలాడిన కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు తాజాగా కృష్ణా జలాలతో కళకళలాడనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో పెద్దగా వర్షాలు పడకపోయినా ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి.. అటు జూరాల మొదలు ప్రకాశం బ్యారేజ్‌ వరకు కృష్ణమ్మ గలగలలు కనిపిస్తున్నాయి.. నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు.. సాగర్‌ మొత్తం గేట్లు ఎత్తి 2.94 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.. దీంతో, పులిచింతలకు వరద తాకిడి పెరిగింది.

నాగార్జున సాగర్‌ నుంచి విడుదల చేస్తున్న 2.94 లక్షల క్యూసెక్కులను యథాతథంగా పులిచింతల ద్వారా ప్రకాశం బ్యారేజీకి వెళ్తోంది. వరద ప్రవాహం పెరగడంతో పులిచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది. పులిచింతల ప్రాజెక్టులో 45 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం ఆరు టీఎంసీలు చేరింది. భారీగా వరద నీరు రావడంతో నాలుగు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బెల్లంకొండ మండలం వేమవరం, రేగులగడ్డ, బోధనం, వెల్లంపల్లి, కోళ్లూరు సహా పలు గ్రామాల్లోకి వరద నీరు రావడంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

పులిచింతల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడం గత నాలుగేళ్లలో ఇదే మొదటిసారి.. కృష్ణా నదిలో వరద ఉధృతి పెరగడంతో గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజికి వస్తున్న నీటిని అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 2.66 టిఎంసిల నీరు నిల్వ ఉంది. బ్యారేజీ వద్ద 55 అడుగుల ఎత్తులో నీరు చేరింది. ఈరోజు సాయంత్రంలోగా ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడిచిపెట్టే అవకాశం కనిపిస్తోంది. అటు డెల్టా కాల్వలకు పది వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తనుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, తుళ్లూరు, తాడేపల్లి, డెల్టాలోని కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, రేపల్లె మండలాలకు వరద ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. డెల్టా పరిధిలోని 28 గ్రామాలకు వరద తాకిడి ఉండవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES