ఆ నాలుగు రాష్ట్రాల్లో వరద విలయతాండవం.. మృతుల సంఖ్య..

ఆ నాలుగు రాష్ట్రాల్లో వరద విలయతాండవం.. మృతుల సంఖ్య..

రుతుపవన వర్షాలతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.. పడమట, దక్షిణాది రాష్ట్రాల్లో వరద విలయతాండవం చేస్తోంది. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లో నదలు పోటెత్తుతున్నాయి. వరద ఉద్ధృతి ఇంకా తగ్గలేదు.. కేవలం ఈ నాలుగు రాష్ట్రాల్లోనే మృతుల సంఖ్య 2 వందలు దాటింది. కేరళలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది...ఈ ఒక్క రాష్ట్రంలోనే చనిపోయిన వారి సంఖ్య వందకు చేరువైంది. ఇప్పటికే దాదాపు 3లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంత్యయారు. వయనాడ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటించారు. సహాయ శిబిరాల్లోని బాధితులను పరామర్శించారు.

కేరళలో వయనాడ్, కోజికోడ్, ఇడుక్కి, మలప్పురం సహా 8 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దక్షిణ రైల్వే పలురైళ్లను రద్దు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు సైన్యం కూడా ముమ్మరంగా సేవలు అందిస్తోంది. వైమానిక దళం సాయంతో బాధితులకు ఆహార పొట్లాలు, నీటి ప్యాకెట్లు అందచేస్తున్నారు. వర్షాలు తగ్గడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలను పునరుద్ధరించారు.

కర్ణాటకలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. సుమారు 2 వేలకు పైగా గ్రామాలు నీట మునిగా యి. నదులు పోటెత్తుతున్నాయి. ఆల్మట్టి సహా అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 40 దాటింది. మరికొందరు గల్లంతయ్యారు. దాదాపు 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 29 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 40వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.. మొత్తం 17 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. తక్షణ సాయంగా 3వేల కోట్లు మంజూరు చేయాలని యడ్యూరప్ప కేంద్రాన్ని కోరారు.

మహారాష్ట్ర ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. కొల్హాపూర్, సాంగ్లి, సతారా, థానే, పుణే, నాసిక్, పాల్ఘర్, రత్నగిరి, రాయ్‌గఢ్, సిందూదుర్గ్‌ జిల్లాల్లో వారం రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలు, పోటెత్తుతున్న వరదలతో వందలాది గ్రామాల జలదిగ్బంధమయ్యాయి. మరణించిన వారి సంఖ్య 40 దాటింది. నాలుగో నెంబరు జాతీయ రహదారి పూర్తిగా పాడవడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. గుజరాత్‌లోని కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లోనూ వరద బీభత్సం సృష్టించింది. ఇక్కడ 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరద ఉధృతికి ఇళ్లు కుప్పకూలుతున్నాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

Tags

Read MoreRead Less
Next Story