Top

పరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ.. కర్నూలు ఓల్డ్‌ సిటీలోకి వరదనీరు..

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బిరబిరా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌ వైపు దూసుకొస్తోంది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాం కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో దిగువకు 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది.

తుంగభద్రకు వరద ఉధృతి పెరగడంతో ఆ నీరంతా కర్నూలు నగరంలోని ఓల్డ్‌ సిటీలోకి చొచ్చుకొస్తోంది.. జమ్మిచెట్టు దగ్గర జోహారపురం మధ్య నీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. 2009లో వచ్చినట్లు మళ్లీ కర్నూల్‌ను వరద ముంచెత్తుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కృష్ణా బేసిన్‌ జూరాల నుంచి 9 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర బేసిన్‌ సుంకేసుల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు చేరుతోంది. భారీగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లును 42 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్ద ఇన్‌ఫ్లో దాదాపు 11 లక్షల క్యూసెక్కులు కాగా.. అవుట్‌ ఫ్లో.. 9 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 190 టీఎంసీలకు చేరింది.

నాగార్జునసాగర్‌కు భారీ వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్ట్‌ మొత్తం గేట్లను ఎత్తివేశారు అధికారులు. 8.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. 26 గేట్లు ఎత్తి 2.20 లక్షల క్యూసెక్కులు విడుదల విడుదల చేస్తున్నారు. సాగర్‌కు భారీగా వరద రావడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో సాగర్‌ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తడంతో జల సోయగాలను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. మరోవైపు కృష్ణా బేసిన్‌లో వరద పోటెత్తుతుండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Next Story

RELATED STORIES