ముఖ్యమంత్రిని కదిలించిన పాప దుఃఖం.. వీడియో వైరల్

ముఖ్యమంత్రిని కదిలించిన పాప దుఃఖం.. వీడియో వైరల్
X

టీచర్ చెప్పింది. మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని. మనకు ప్రాణవాయువుని ఇచ్చే మొక్కలకు కొంచెం నీరు పోస్తే చాలు పెరిగి పెద్దవై మనిషికి ఎంతో మేలు చేస్తాయని చెప్పిన టీచర్ మాటలను అక్షరాలా ఆచరించింది మణిపూర్‌కి చెందిన తొమ్మిదేళ్ల ఎలంగ్ బామ్ వాలెంటినా దేవి. మణిపూర్‌లోని కాంచింగ్ పట్టణంలోని అముటాంబి డివైన్ లైఫ్ పబ్లిక్ స్కూల్లో వాలెంటినా అయిదో తరగతి చదువుతోంది. ఎప్పుడో ఒకటో తరగతిలో ఉన్నప్పుడు రోడ్డు పక్కన రెండు గుల్ మొహర్ మొక్కలు నాటింది. రోజూ వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు మొక్కల్ని చూసుకునేది. వాటర్ బాటిల్‌తో నీళ్లు తెచ్చి వాటికి పోసేది. తానిప్పుడు అయిదో తరగతికి వచ్చింది. మొక్కలు కూడా పెరిగి పెద్దవయ్యాయి.

ఓరోజు ఇలానే స్కూలు నుంచి వస్తోంది. అంతలో రోడ్ వైండింగ్‌లో భాగంగా చెట్లను తొలగిస్తున్నారు. అందులో వాలెంటినా నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. దూరాన్నుంచే గమనించిన వాలెంటినా పరుగున వచ్చి ఏడుపు లంకించింది. ఎందుకేడుస్తున్నావు అని అక్కడి వాళ్లు ఆరా తీస్తే నా మొక్కలు.. నేను ఎంతో కష్టపడి పెంచుకున్న మొక్కలు పీకేశారు అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇదంతా గమనిస్తున్న ఓ పాదచారి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో ముఖ్యమంత్రి నంగోతమ్ బామ్ బీరెన్ కంట పడింది. పాప మొక్కల కోసం వెక్కి వెక్కి ఏడవడం ఆయన్ను కదిలించింది. ఆ చిన్న పాప ఆత్మీయులెవరో చనిపోయినంతగా ఏడ్చింది. పెద్దవాళ్లెవరూ అంతగా పట్టించుకోని చెట్లకోసం.. చిన్నారి ఆవేదన నన్ను కదిలించింది. వెంటనే జిల్లా ఎస్ పి యాంగ్ కామ్ విక్టోరియాకు ఫోన్ చేసి పాపను ఓదార్చమని చెప్పాను. తనకు 20 మొక్కలు ఇచ్చి ఇష్టం వచ్చిన చోట భద్రంగా నాటమని చెప్పాను' అని ముఖ్యమంత్రి ది హిందూకు చెప్పారు. ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ మణిపూర్ మిషన్‌కు పాప కంటే యోగ్యులైన ప్రతినిధి ఎవరుంటారని అనిపించింది. అందుకే ఈ కార్యక్రమానికి పాపనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెకు ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తుంది. ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది. మణిపూర్‌లో అడవుల విస్తీర్ణం పెంచేందుకు చేపట్టే ప్రతి కార్యక్రమంలో, ప్రతి ప్రకటనలో పాప ఫోటో ఉంటుంది అని ముఖ్యమంత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపట్ల స్థానికులు, స్కూలు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES