మద్యం విషయంలో 'జగన్' అన్న మాటను వైసీపీ ఎమ్మెల్యే నిజం చేశారు : నారా లోకేష్

మద్యం విషయంలో జగన్ అన్న మాటను వైసీపీ ఎమ్మెల్యే నిజం చేశారు : నారా లోకేష్

ఏపీలో జగన్‌ పాలనపై ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వరుస ట్వీట్లతో దాడి చేస్తున్నారు. పోలవరం లాంటి ప్రాజెక్టు కట్టడమంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగ్ కాసినంత సులభం అన్నట్లు కొందరు మేధావులు మాట్లాడుతున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాఫర్‌డ్యాం కట్టడం వల్లే గ్రామాలు మునిగాయంటూ.. కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని ఫైరయ్యారు. కేంద్ర పర్యవేక్షణ, పోలవరం అథారిటీ, సీడబ్ల్యూ నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టామని గుర్తుచేశారు.

ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయని, ఇంజనీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి డిజైన్లను అందిస్తారని గుర్తుచేశారు. ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇక నెల్లూరులో జర్నలిస్టు ప్రసాద్‌పై ఎమ్మెల్యే కోటం రెడ్డి దాడిని చంద్రబాబు ఖండించారు. వైసీపీ వాళ్లు తప్పులు చేస్తారు.. ఆ తప్పుల్ని ఎత్తిచూపిన వాళ్ళను చంపడానికి వెళ్తారని ట్విట్టర్‌లో మండిపడ్డారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా అని ప్రశ్నించారు. బాధితుడి వీడియోను తన ట్విట్టర్‌లో చంద్రబాబు పోస్టు చేశారు.

నేడు విజయవాడలో టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 2 నెలల్లో జరిగిన దాడులు, వైసీపీ అవలంభిస్తున్న తప్పుడు విధానాలతో జరుగుతున్న ఘోరాలు.. భౌతిక దాడులతో పాటు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని.. ఓట్ల తొలగింపుపై న్యాయపోరాటం చేద్దామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఏపీ సీఎం జగన్‌ పాలనపై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. మద్యం మానవ సంబంధాలని మంటగలుపుతుందని జగన్ అన్నమాటను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిజం చేశారంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు. కోటంరెడ్డి మద్యం తాగి విలేఖరి ఇంటికి వెళ్లి దాడి చేసి బెదిరించారని, జగన్ కూడా నన్నేమీ చేయలేరంటూ వైసీపీ అధినేత పరువు తీసేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో చంద్రబాబును ఎమ్మెల్యే కోటంరెడ్డి ఖబడ్దార్‌ అని బెదిరిస్తే.. జగన్‌ ముసిముసి నవ్వులు నవ్వారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడా ముఖాన్ని జగన్ ఎక్కడ దాచుకోవాలో తెలియడం లేదని లోకేష్‌ వ్యాఖ్యానించారు.

ఇటు గ్రామ వాలంటీర్ల నియామకంపైనా లోకేష్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌.. స్కామ్ స్టార్ అని మరో సారి రుజువైందని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో 12వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. నాలుగు లక్షల మంది వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి.. 10 లక్షల మందికి ఉద్యోగాలు తీసేసే భారీ కుట్రే.. వైసీపీ వాలంటీర్ల స్కీమ్‌ అంటూ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story