ఎన్నారైలకు షాక్.. ప్రవాస భారతీయులు ఇక ఇంటి బాటే?

ఎన్నారైలకు షాక్.. ప్రవాస భారతీయులు ఇక ఇంటి బాటే?

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న ఎన్నారైలకు ట్రంప్ సర్కార్ మరోసారి పిడుగులాంటి వార్త వినిపించింది. పాతికేళ్ల కిందటి చట్టానికి సానపెట్టి ఎన్నారైలపై ప్రయోగించేందుకు సిద్దమైంది. అల్పాదాయం కల్గిన వారికి గ్రీన్ కార్డు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీంతో తక్కువ వేతనాలు తీసుకుంటున్న వేలాదిమందిపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనల కారణంగా వేలాదిమంది ప్రవాస భారతీయులు ఇంటి బాట పట్టే అవకాశం ఉంది.

అమెరికాలో నివసిస్తూ గ్రీన్ కార్డుకోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఎన్నారైలకు అమెరికా ట్రంప్ సర్కార్ షాకిచ్చింది. అల్పాదాయం ఉన్న వ్యక్తులకు గ్రీన్ కార్డు ను ఇచ్చే అవకాశం లేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు అమెరికాలో ఫుడ్ స్టాంప్స్ వోచర్లు ఇస్తుంది. దీని ద్వారా ఆహరంతో పాటు వైద్యసహాయం, గృహ సదుపాయం తదితర సౌకర్యాలను వారికి ప్రభుత్వం అందిస్తోంది. ఇలాంటి వారికి గ్రీన్ కార్డును నిరాకరించే అవకాశం ఉందని వెల్లడించింది.

అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనుకునే ప్రవాసులు ... అక్కడి పౌరులకు ప్రభుత్వం అందించే సౌకర్యాలను తాము భవిష్యత్ లో ఆశించబోమంటూ కాన్సులర్ అధికారులకు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీల వంటివి తాము తీసుకోబోమని తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అమెరికా రావాలనుకున్న వారు, లేదా ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు తమ ఖర్చులను తామే భరించేలా... ప్రభుత్వం అందించే సౌకర్యాలపై ఏమాత్రం ఆధారపడకుండా ఉండేలా ఈ నిబంధన ఉంటుందని అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీలను, సౌకర్యాలను పొందే వ్యక్తులను అమెరికా దేశ అధికారులు గుర్తిస్తారు. అలాంటివారిని పబ్లిక్ చార్జ్ లుగా పరిగణిస్తారు. వీరు దేశంలో అధిక సంఖ్యలో ఉండటం వల్ల ప్రభుత్వం పై ఎక్కువ భారం పడుతోంది. తక్కువ ఆదాయం కల్గిఉన్న వారు దేశంలోకి వచ్చిన తర్వాత వారికి సౌకర్యాలు అందిచడంకంటే... వారిని దేశంలోకి రాకుండా నిరోధించడమే మేలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ఇప్పటికే దేశంలో ఉంటున్నవారు కూడా తమ ఇమ్మిగ్రేషన్ స్థాయిని మార్చుకునే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. విదేశీయులపై ప్రజాధనం ఖర్చు చేయకూడదనే ఈ కఠిన నిబంధన తీసుకున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం విధించిన నూతన నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డు పొందాలనుకునేవారు తప్పకుండా తమ ఆదాయాన్ని పెంచుకొని ప్రభుత్వానికి చూపించాల్సి ఉంటుంది.

ఇప్పటికే దేశంలోకి అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న అధ్యక్షుడు ట్రంప్... దేశంలో ఉన్న అల్పాదాయం వారిని సైతం దేశం విడిచి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అల్పాదాయ నిబంధన చట్టం 1996 నుంచే ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిని ఏనాడు పెద్దగా పట్టించుకోలేదు. మేక్ అమెరికా గ్రేట్ అగేయిన్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎన్నారైలపై కఠిన నిర్ణయాలు తీసుకుంటూ అమెరికన్లకు మేలు చేసే చట్టాలను ముందుకు తెస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story