'వరదపై ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదు'

వరదపై ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదు

కృష్ణా నది వరద ఉధృతికి విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ముంపు భయం మొదలైంది. ఇప్పటికే కృష్ణలంక, రణదీవెనగర్, రాణిగారి తోట, గీతానగర్‌లోని పలు కాలనీల్లోకి నీళ్లు వచ్చాయి. వరద నీరు కొన్ని ఇళ్లలోకి చేరడంతో.. కట్టుబట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహాయమూ అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అటు, ఈ విషయం తెలుసుకున్న తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్.. అక్కడికి వెళ్లారు. పునరావాస ఏర్పాట్లలో వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టిందని, ఇప్పటి ప్రభుత్వం కనీసం వరదపై ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.

ఎగువ నుంచి పోటెత్తిన వరదలకు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. నదితో పాటు ఉపనదులు, పాయలు పొంగి పొర్లుతుండడంతో ఆయా ప్రాంతాల్లోని కుంటలు, కాలువలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిప్రవాహం ఎక్కువై కొన్నిచోట్ల కుంటలు, చెరువుల కట్టలకు గండి పడుతున్నాయి. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పోతార్లంకలో కృష్ణ కరకట్టకు కొద్దిపాటి గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు.

వరదల్లో చిక్కుకున్న రైతులను కాపాడేందుకు ఓ సీఐ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వయంగా తానే బోట్‌లో వెళ్లి రైతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కృష్ణానది పాయలు ఉప్పొంగడంతో ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలోని పంట పొలాలు నీటి మునిగాయి. విద్యుత్‌ మోటార్లను తీసుకురావడానికి వెళ్లిన ఏడుగురు రైతులు వరదల్లో చిక్కుకున్నారు. బోటు సాయంతో చల్లపల్లి సీఐ వెంకట నారాయణ వారందరినీ రక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story