వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి జనసేన పార్టీ : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి జనసేన పార్టీ : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. మూడేళ్ల నుంచి పోరాటాలు చేసి ఉంటే గెలిచే వాళ్లమన్నారు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేనూ లాక్కొనేందుకు యత్నిస్తున్నారని, ఎమ్మెల్యే రాపాకపై పలు కేసులు పెట్టారని పవన్ మండిపడ్డారు.. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం తర్వాత లోపాలను సరిద్దిద్దే పనిలో పడ్డారు పవన్‌ కల్యాణ్.. ఈ నేపథ్యంలోనే నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్తు వ్యూహాలను వారికి వివరించారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్టు ఎపిసోడ్‌పై సమావేశంలో ఘాటుగా స్పందించారు పవన్‌ కల్యాణ్. ఎమ్మెల్యే హోదాకు గౌరవం ఇవ్వకుండా ఎస్సై అవమానించారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో దోషులను ఇంత వరకు ఎందుకు పట్టుకోలేదని, జర్నలిస్టుపై ఎమ్మెల్యే దాడి చేస్తే కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తనను రెచ్చగొడితే ఎంతవరకైనా పోరాడుతానని అన్నారు. హక్కులను కాలరాయాలని చూస్తే చేతులు ముడుచుకొని కూర్చోబోమన్నారు.. ప్రభుత్వం మెడలు వంచే సత్తా మన పార్టీకి ఉందంటూ జనసైన్యానికి వివరించారు.

అలాగే గత ఎన్నికల్లో ఎందుకు ఓడాల్సి వచ్చిందో కూడా పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. చప్పట్లు కొట్టిన వారంతా ఓట్లు వేసినా ఘోరంగా ఓడిపోయేవాళ్లం కాదని పేర్కొన్నారు. ఈలలు, చప్పట్లు కావాలంటే సినిమాలే చేసేవాడినని, క్రమశిక్షణ లేకపోవడమే జనసేన ఓటమికి కారణమని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 2 వేలకు అమ్ముడుపోయారు కాబట్టే ఇప్పుడు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించలేకపోతున్నారంటూ పరోక్షంగా ప్రజలనుద్దేశించి పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేశారు.

అటు కొందరు పార్టీని వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనా పవన్‌ కల్యాణ్‌ తనదైన శైలిలో స్పందించారు.. సమాజ శ్రేయస్సు కోరేవారు జనసేనను వీడరన్నారు. సొంత అజెండాలు ఉన్న వారు సంతోషంగా వేరే పార్టీలోకి వెళ్లిపోవచ్చని సూచించారు.. పార్టీలో ఇన్‌చార్జ్‌ అంటే పదవి కాదని, బాధ్యత అని గుర్తు చేస్తూనే కమిటీల్లో కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story