గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

తెలంగాణలో జల దృశ్యం ఆవిష్కృతం అవుతోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని అన్నారు. దాని ఫలాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అదే స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.

బంగారు తెలంగాణ సౌధాన్ని వేగవంతంగా నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పునాదులు పడ్డాయని.. అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గోల్కొండ కోట వేదికగా వివరించారు. బూజు పట్టిన చట్టాల స్థానంలో కొత్తవి తెస్తున్నట్టు చెప్పారాయన. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

తెలంగాణలో సామరస్య జీవనం కొనసాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజల సహకారం అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి.. ఆరోగ్య తెలంగాణ సాధించామన్నారు. హైదరాబాద్‌ ప్రజల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story