అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణుల ఆందోళన

అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణుల ఆందోళన

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతున్నఆయన ఆరోగ్యం.. మరింత విషమించినట్లు సమాచారం. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఈ నెల 9న జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కాసేపట్లో ఎయిమ్స్‌కు చేరుకోనున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత మరో సమస్య వచ్చింది. మృదుకణజాల కేన్సర్‌తో జైట్లీ సతమతమయ్యారు. ఆ వ్యాధికి అమెరికాలో చికిత్స కూడా చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన ఆరోగ్యం విషమించడంతో.. వారం క్రితం ఎయిమ్స్‌లో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story