మహిళలకు సీఎం గుడ్‌న్యూస్.. మెట్రో, డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో ప్రయాణం ఉచితం

మహిళలకు సీఎం గుడ్‌న్యూస్.. మెట్రో, డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో ప్రయాణం ఉచితం
X

ఢిల్లీలో ఎన్నికల సీజన్ ముంచుకొస్తుండటంతో ఫ్రీ మంత్రం తెరమీదకు దూసుకువస్తోంది. ఒక్కో వర్గానికి ఒక్కో వరంతో ఎలక్షన్ తాయిలాలు సిద్ధం చేస్తున్నారు కేజ్రివాల్. కరెంట్ ఫ్రీ కాన్సెప్ట్ తర్వాత ఇప్పుడు రాఖీ రోజున ఢిల్లీ మహిళలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ గుడ్‌న్యూస్ చెప్పారు. డీటీసీ, క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రకటించారు. అయితే.. కేంద్రం కొర్రితో మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంకా పట్టాలెక్కలేదు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఢిల్లీలో గిఫ్ట్ పాలిటిక్స్ ఊపందుకుంటున్నాయి. దేశమంతా బీజేపీ పట్టుబిగిస్తుండటంతో ఢిల్లీ గద్దెను కాపాడుకునేందుకు కేజ్రివాల్ సర్కార్ కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మొత్తం 7 లోక్‌సభ స్థానాలుండగా.. ఒక్క చోట కూడా గెలువలేకపోయింది. దీంతో 2020లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రీ మంత్రంతో జనంలోకి వెళ్తోంది.

గత జూన్ నుంచే ఉచిత ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నారు కేజ్రివాల్. ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. అయితే.. కేంద్రం అభ్యంతరాలు చెప్పటంతో ఆ ప్రయత్నాలు ఇంకా పట్టాలు ఎక్కలేదు. మెట్రో ఉచిత ప్రయాణానికి మెలిక పెట్టడంతో రక్షాబంధన్ రోజున మహిళలకు మరో రూపంలో వరాలు కురిపించారు కేజ్రివాల్. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ తో పాటు క్లస్టర్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించొచ్చని ప్రకటించారు సీఎం కేజ్రివాల్. అక్టోబరు 29 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.

ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 700 కోట్ల అదనపు భారం పడనుంది. మహిళ సురక్షితమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న కేజ్రివాల్ ఇందుకోసం ఢిల్లీ అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కరెంట్ కూడా ఫ్రీగా ప్రకటించింది కేజ్రివాల్ ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఫ్రీగా విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు. ఇక జూన్ లో ప్రకటించినట్లు మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు కావాలంటే మరింత భారం పడనుంది. ప్రస్తుతం మెట్రోలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు చెరో 50 శాతం చొప్పున భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు మెట్రోల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తే కేంద్రానికి రావాల్సిన మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

Also Watch :

Next Story

RELATED STORIES