తాజా వార్తలు

తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు

తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
X

తెలంగాణలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 242 ఆస్పత్రుల్లో అర్ధరాత్రి నుంచి సేవలు ఆగిపోయాయి. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు వైద్య సేవలు అందించమని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ఈ నెల 10 నుంచే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ, ఉద్యోగులు, ఫించనుదారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని నిలిపివేసింది. ప్రభుత్వం ముందు నాలుగు ప్రధాన డిమాండ్లను ఉంచాయి తెలంగాణ ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు. సుమారు 15 వందల కోట్లు బకాయిలు పేరుకు పోయాయని, వీటిని వెంటనే చెల్లించాలని కోరుతున్నాయి. అలాగే 2007లో ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌తో MOU, ప్యాకేజీ రేట్స్ సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. చర్చలతో ఫలితం లేదని, ప్రభుత్వం హామీలిస్తుందే తప్ప, వాటిని అమలు చేయడం లేదని విమర్శిస్తున్నాయి.

ఆరోగ్య శ్రీతో పాటు ఇతర పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే 100 కోట్లు ఇచ్చింది. ప్రాధాన్య క్రమంలో నెట్‌ వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదల చేసింది. ఒకట్రెండు రోజుల్లో మరో 200 కోట్లు ఇస్తామని తెలిపింది. అయితే 15 వందల కోట్ల బకాయిల్లో 300 కోట్లు ఏ మేరకు సరిపోతాయని ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు బకాయిలు 700 కోట్లే ఉంటాయని, వాటిని దశల వారీగా చెల్లిస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

Also Watch :

Next Story

RELATED STORIES