శాంతించిన వరుణుడు.. తగ్గుతున్న వరదలు

శాంతించిన వరుణుడు.. తగ్గుతున్న వరదలు

భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమైంది. మృతుల సంఖ్య 104కు చేరింది.మరో 36 మంది గల్లంతవ్వగా, 35 మంది తీవ్రంగా గాయపడినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మలప్పురం జిల్లాలోని కావలప్పరలో కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. ఇక్కడ సహాయక చర్యలు పూర్తయితే మృతుల సంఖ్యపై మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అటు కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గడంతో సహాయ శిబిరాల నుంచి ప్రజలు వారి ఇళ్లకు వెళ్తున్నారు.

అటు మలప్పురం, కోజికోడ్ జిల్లాకు మాత్రం ఇంకా ముప్పు తొలగలేదు. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంతి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమ్యయారు. లోతట్టు ప్రాంత ప్రజలను శిబిరాలకు తరలించారు. సహాయ చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్‌తో పాటు వాలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారు...వరద బాధితులకు వచ్చే 3నెలల పాటు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి గత సంవత్సరం వచ్చిన పెను విపత్తు నుంచే కేరళ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మళ్లీ ఈలోపే జలప్రళయం ముంచెత్తింది. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా 14 జిల్లాలు పూర్తిగా ప్రభావితం అయ్యాయి. భారీగా పంటనష్టంతోపాటు ఆస్తినష్టం కూడా వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 30వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

మరోవైపు భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో వరుణుడు ఇప్పుడిప్పుడే శాంతిస్తున్నాడు. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పునరావాస కేంద్రాలకు తరలివెళ్లిన ప్రజలు క్రమంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. వరదల ధాటికి 11,901 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 1115 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొన్ని జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ను ఎత్తివేసినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ రెడ్‌ అలర్ట్‌ కొనసాగడంలేదని అధికార వర్గాలు తెలిపాయి.

వరదలతో కొన్ని ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు ఆపన్న హస్తం అందించిన పలు రాష్ట్రాలకు కేరళ సీఎం పినరయి విజయన్‌ ధన్యవాదాలు తెలిపారు. వరదల ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింద నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 10వేలు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక వయనాడ్‌లోని పుతుమల, మలప్పురంలోని కవలప్పరలో కొండచరియలు విరిగిపడటంతో గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story