పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి శాపంగా మార్చేస్తున్నారా?

పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి శాపంగా మార్చేస్తున్నారా?

ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి శాపంగా మార్చేస్తున్నారా? పోలవరం రీటెండరింగ్‌పై ఆ ప్రాజెక్టు అథారిటీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మళ్లీ టెండర్లు పిలవాలనుకోవడం.. ఆ ప్రాజెక్టును అనిశ్చితిలో నెట్టేస్తుందని.. ఆ ఆలోచన విరమించుకోవాలని జగన్ ప్రభుత్వానికి సూచన చేసింది. ఏపీ సర్కార్‌ పోలవరం రీటెండరింగ్‌ ప్రకటనకు సిద్ధమవుతూ.. శుక్రవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో.. ప్రాజెక్టు అథారిటీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సూచనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ-PPA ఈనెల 13న హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. అథారిటీ సీఈఓ RKజైన్... కేంద్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ప్రిక్లోజర్, రీటెండరింగ్ ఆలోచనల్ని విరమించుకోవాలని జైన్‌ చెప్పారు. పాత టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరం కానీ.. ఆ ఆలోచనకు బలమైన ప్రాతిపదిక కానీ లేదని గుర్తుచేశారు. రీటెండరింగ్‌తో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని, ఫలితంగా ఖర్చు, కష్టాలు పెరిగిపోతాయని జైన్‌ అంటున్నారు. ఆర్థికంగానే కాదు.. సామాజికంగానూ ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

పోలవరం రీటెండరింగ్ ఆలోచనపై 13వ తేదీన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తంచేసింది. మూడు రోజుల్లో మరోసారి లేఖ రాసింది. రీటెండరింగ్‌ పేరుతో కొత్త సంస్థకు పనులు అప్పగిస్తే పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయని సూటింగా చెప్పారు RK జైన్. టెక్నాలజీ, డిజైన్ల పరంగానూ సమన్వయం కష్టం అవుతుందన్నారు. పెరిగే ఖర్చును కేంద్రం భరించబోదనీ ఆయన చెప్తుండడం పోలవరం భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జాతీయ ప్రాజెక్టయిన పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. నిర్మాణ పనుల్ని రాష్ట్రానికి అప్పగించింది. అందుకయ్యే ఖర్చును రీఎంబర్స్‌ చేస్తోంది కేంద్రం. అయితే.. రీటెండరింగ్‌పై ప్రాజెక్టు అథారిటీ ఆందోళన, అభ్యంతరం వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడం సాధ్యమేనా? మరి, జగన్ ప్రభుత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story