కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక

ఇవాళ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల భారీవానలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి వరసగా మూడు రోజులు, రాయలసీమ పరిధిలో 4 రోజులు ఉరుములతో కూడిన జల్లులు పడతాయన్నారు వెల్లడించారు.
మరో వైపు గోదావరి వరద ప్రవాహం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా మన్యం పరిధిలోని దేవీపట్నం, తొయ్యేరు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.దేవీపట్నంలోని మత్స్యకారపేటతోపాటు తొయ్యేరు ఎస్సీకాలనీ చుట్టూ వరద నీరు చేరింది. దేవీపట్నం- తొయ్యేరు ఆర్‌అండ్‌బీ రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గానుగులగొందు, ఏనుగులగూడెం వైపునకు చేరుతోంది.
తొయ్యేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల చుట్టూ వరదనీరు చేరడంతో కళాశాలకు సెలవు ప్రకటించారు. దండంగి- డి.రావిలంక గ్రామాలకు మధ్యలో ఆర్‌అండ్‌బీ రహదారిపై వరద నీరు చేరడంతో పోశమ్మగండి వైపు రాకపోకలకు అంతరాయం నెలకొంది. పోశమ్మగండి వద్ద గోదావరి వరద ఇళ్లను తాకుతూ దిగువకు ప్రవహిస్తోంది. వీరవరపులంక వద్ద ఎగువ కాఫర్‌డ్యాంను ఆనుకుని వరద నీరు పోటెత్తుతోంది.
గోదావరి వరద ప్రవాహం పెరగడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరదనీరు 9.50 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ నుంచి సముద్రంలోకి 7.37లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com