ఏపీలో అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తాం - జగన్

ఏపీలో అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తాం - జగన్

అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందించటమే తన లక్ష్యమని అన్నారు ఏపీ సీఎం జగన్. రెండు నెలల్లోనే అభివృద్ధి దిశగా అడుగులు వేశామని గుర్తు చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నామని డల్లాస్ లోని ప్రవాసాంధ్రులకు తమ ప్రభుత్వ అభివృద్ధిని వివరించారు. అదే సమయంలో వైసీపీ విజయంలో ప్రవాసుల కృషి ఉందన్నారు జగన్.

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారికి అమెరికా పర్యటకు వచ్చిన సీఎం జగన్ కు సాదర స్వాగతం పలికారు ప్రవాసాంధ్రులు. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. వైఎస్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించిన సీఎం జగన్..ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కృషి ప్రవాసాంధ్రులకు వివరించారు జగన్. అంతేకాదు ఏపీలో పెట్టుబడికి ఉన్న అనువైన వాతావరణాన్ని వివరించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. అందరూ తమ తమ గ్రామాల అభివృద్ధికోసం సహకరించాలని కోరారు జగన్.

తమ ప్రభుత్వం అతి స్వల్ప కాలంలోనే చేపట్టిన చారిత్రాత్మక నిర్ణయాలను ప్రవాసాంధ్రులకు వివరించారు సీఎం జగన్. రివర్స్ టెండరింగ్, నామినేటెడ్ పదవుల్లో 50 మహిళలకు, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టం చేశామన్నారు. మొత్తం 19 బిల్లులను ఆమోదించామని అన్నారు. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు.

సూదీర్ఘంగా సాగిన జగన్ ప్రసంగంలో ఏపీలో ప్రవాసాంధ్రుల పెట్టుబడులకు ఆకర్షించటం లక్ష్యంగా చేసుకున్నారు. కనీసం ఏడాదికి ఒకటి.. రెండు సార్లయినా ప్రవాసాంధ్రులను ఏపీకి రావాలని ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు జగన్. అనంతరం డల్లాస్‌ నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో అమెరికాలో తెలుగువాళ్ల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story