తాజా వార్తలు

కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో చర్చించనున్న సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో చర్చించనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో చట్టం ఉండాలంటే ఎలాంటి నిబంధనలు రూపొందించాలనే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు.

క్షేత్ర స్థాయిలో తమ అనుభవంలో ఉన్న విషయాలను, కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్ల వద్ద నుంచి తీసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్‌. ఇందుకోసం కలెక్టర్లు కూడా అభిప్రాయాలు, సూచనలు చెప్పడానికి.. చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్ధమై రావాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. అలాగే కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలుపైనా సమావేశంలో చర్చించనున్నారు. పల్లెలు, పట్టణాలలో అమలు చేయబోయే 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు అంశాలపై సమగ్ర చర్చ జరగాల్సి ఉన్నందున రెండ్రోజులపాటు కలెక్టర్ల సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇదే సమయంలో రెవెన్యూ శాఖకు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్‌. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న రాజేశ్వర్‌ తివారిని బదిలీ చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న నేపథ్యంలో తివారిని బదిలీచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ను అటవీ పర్యావరణ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నీటి పారుదల శాఖ, వాణిజ్య పన్నులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సోమేశ్‌ కుమార్‌కు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌తోపాటు.. రెరా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే, పంచాయతీరాజ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న నీతూకుమారి ప్రసాద్‌ను కూడా బదిలీ చేశారు. ఆమె స్థానంలో గత కొంతకాలంగా పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్న రఘునందన్‌రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలో కీలక మార్పులు ప్రతిపాదించిన ప్రభుత్వం.. ఆ సంస్కరణలన్నీ గట్టిగా అమలు చేసేందుకు బలమైన అధికారి కావాలనే ఉద్దేశంతో రఘునందన్‌ రావును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story

RELATED STORIES