బీజేపీ కోర్ కమిటీ కీలక నిర్ణయాలు

బీజేపీ కోర్ కమిటీ కీలక నిర్ణయాలు

తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ పార్టీ కోర్ కమిటీ. సెప్టెంబర్ 17 నుంచి నమో భారత్, నవ తెలంగాణ పేరుతో పోరు బాటకు సిద్ధం అవుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవ సెంటిమెంట్ పై ఫైట్ చేయాలని నిర్ణయించింది కోర్ కమిటీ. ముందు పార్టీని జనంలోకి తీసుకెళ్లటం..ఆ తర్వాత కేడర్ ను పటిష్టపర్చుకోవటం.. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటం. ఇది తెలంగాణలో బీజేపీ యాక్షన్ ప్లాన్. ఇప్పటికే వలసలతో నేతల కొరత తీర్చుకుంటున్న బీజేపీ..కేడర్ ను పటిష్టం చేసుకునేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యోచనలో ఉంది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కోర్ కమిటీ.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో భాజపా బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా నేతృత్వంలో బీజేపీ కోర్‌ కమిటీ భేటీ అయ్యింది. నమో భారత్‌- నవ తెలంగాణ’ నినాదంతో సెప్టెంబరు 17న కార్యచరణ చేపట్టాల్సిందిగా పార్టీ శ్రేణులకు నడ్డా పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే పార్టీ సభ్యత్వాల నమోదు, పార్టీకి చేరికలపై ఫోకస్ చేయాలని ఢిల్లీ నాయత్వం రాష్ట్ర బీజేపీకి సూచించింది.

పార్టీ పటిష్టత కోసం ప్రతి 15 రోజులకోసారి కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు నేతలు. అప్పటి పరిస్థితులను విశ్లేషించుకొని కార్యచరణను రూపొందించాల్సిందిగా నేతలకు వివరించారు. తెరాస ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అంతకుముందు సిటీలోని బీజేపీ ఆఫీస్ లో పార్టీ పదాధికారులతో సమావేశమయ్యారు జేపీ నడ్డా. పాత, కొత్త నేతల కలయికతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నడ్డా చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story