బుజ్జి పాప బొమ్మల వ్యాపారం.. సంపాదన ఏకంగా రూ.55 కోట్లు..

బుజ్జి పాప బొమ్మల వ్యాపారం.. సంపాదన ఏకంగా రూ.55 కోట్లు..

ఆరేళ్ల పిల్లకి ఏం వచ్చు.. ఆడుకుంటుంది.. అమ్మ పెడితే తింటుంది.. అంతేనా.. అంతకంటే ఎక్కువే.. చాలా ఎక్కువే చేస్తాను.. మీ అందరికంటే బోలెడు డబ్బులు ఎక్కువ సంపాదించేస్తానంటోంది ఈ బుజ్జి బంగారం. దక్షిణ కొరియాకు చెందిన బోరమ్ అమ్మానాన్నలు బొమ్మల వ్యాపారం చేస్తారు. రోజూ షాపులోకి వచ్చి బోరమ్ బొమ్మల మధ్య కూర్చుని తెగ అల్లరి చేసేది. కానీ కస్టమర్లు ఎవరైనా బొమ్మలు కొనడానికి వచ్చినప్పుడు అమ్మానాన్న ఆ బొమ్మల గురించి అవి ఎలా పనిచేస్తాయో చెబుతుంటే తనూ ఆసక్తిగా ఆలకించేది.

ఓ రోజు అమ్మ చేతిలో బొమ్మ లాక్కుని నేను చెప్తా దీని గురించి అని అనేసరికి వచ్చిన కస్టమర్ ఒకింత ఆశ్చర్యంతో చెప్పు తల్లీ అని అనడంతో.. ఎంతో చక్కగా వివరించింది. దానికి ఆశ్చర్యపోవడం అమ్మ వంతయ్యింది. అప్పటి వరకు తెలియదు తన చిన్నారికి ఇన్ని తెలివి తేటలు ఉన్నాయని. అప్పడే బుర్రలో ఓ మెరుపు లాంటి ఆలోచన తట్టింది బోరమ్ అమ్మానాన్నలకి. బొమ్మల గురించి మనం చెప్పేకంటే బోరమ్ చెబితే బొమ్మల సేల్స్ పెరుగుతాయని భావించారు. అనుకున్నదే తడవుగా ఆన్‌లైన్‌లో బొమ్మల బిజినెస్.. వాటికి బోరమ్ రివ్యూలు. కెమెరా ముందు బోరమ్ యాక్షన్.. చిట్టి పొట్టి మాటలు వ్యూయర్స్‌కి తెగ నచ్చేశాయి. ఒక్కసారిగా బొమ్మల సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. వారి సంపాదన కూడా పెరిగిపోయింది.

ఇప్పుడు బోరమ్ ఏకంగా 'బోరమ్ ట్యూబ్ వ్లోగ్, బోరమ్ ట్యూబ్ టాయ్ రివ్యూ' పేరుతో రెండు యూట్యూబ్ ఛానళ్లు మొదలు పెట్టింది. ఒకదాంట్లో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లెగో టాయ్స్, పజిల్స్, మేకప్ టాయ్స్, ప్లే హౌస్ వంటి రకరకాల బొమ్మలతో ఆడుతూ అవి ఎలా పని చేస్తాయో చెబుతుంది. రెండో దాంట్లో తను చేసి అల్లరి పనులు, సరదా సాహసాలు అన్నీ అందులో ఉంచుతుంది. బోరమ్ వీడియోలు చూసి ఫాలో అయ్యే వారి సంఖ్య మూడు కోట్ల మంది ఉన్నారంటే ఈ పాప ఎంత పాపులరైందో తెలుస్తుంది. అలా తను సంపాదించిన డబ్బు ఇప్పటికే రూ. 55 కోట్లు దాటింది. ఓ ఇల్లు కూడా కొనేసింది. మీ ఇంట్లో కూడా ఉన్నారేమో ఇలాంటి గడుగ్గాయిలు. వారిలోని టాలెంట్‌ని వెలికి తీయండి.

Tags

Read MoreRead Less
Next Story