సెప్టెంబర్ 1 నుంచి రూల్స్ కఠినంగా.. ఇకపై ఇలా చేస్తే మీ బండి రోడ్డెక్కదు

సెప్టెంబర్ 1 నుంచి రూల్స్ కఠినంగా.. ఇకపై ఇలా చేస్తే మీ బండి రోడ్డెక్కదు

ఆటో కెపాసిటీ నలుగురైతే ఎనిమిది మందిని ఎక్కించుకోవడం.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా మరో రూట్‌లో వెళ్లిపోవడం.. పుల్లుగా మందుకొట్టి రయ్యిమంటూ బండి మీద దూసుకు పోవడం.. ఇవన్నీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసు. అయినా నిర్లక్ష్యం. నలుగురికి ఎనిమిది మంది ఎక్కితే నాలుగు డబ్బులు వస్తాయేమో కాని నిండు ప్రాణాలు బలైతే ఆ కుటుంబాలకు తీరని వేదన మిగులుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రవాణా నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుంచి రానున్న మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కఠినంగా వ్యవహరించనుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రస్తుతం వసూలు చేస్తున్న జరిమానాను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల జారీ, రహదారి భద్రతా నిధి, ప్రైవేటు క్యాబ్ వ్యవస్థల స్థిరీకరణ, రవాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశలవారీగా అమలులోకి తీసుకురానున్నారు. అధిక బరువుతో నడిచే వాహనాలకు ఇంతకు ముందు రూ.1,000 నుంచి 2,000లు వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా రూ.20,000 కు పెంచారు. అలాగే అధిక సంఖ్యలో ప్రయాణీలకులను ఎక్కించుకుంటే ఫైన్ కింద ఒక్కొక్కరికి రూ.1000 వసూలు చేయనున్నారు. బైక్‌పై అధిక బరువు వినియోగిస్తే రూ.2 వేలు ఫైన్, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ సస్పెండ్ చేస్తారు. గతంలో ఇలాంటి కేసులకు రూ.100లు వసూలు చేసేవారు.

హెల్మెట్ పెట్టుకోలేదనుకోండి ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తున్నారు. కానీ ఇకపై 100 కాదు రూ.1000, దాంతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. మద్యం సేవించి బండి నడిపితే 2వేలు నుంచి 10వేలకు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000లు, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5,000, లైసెన్స్ రద్ధు చేసినా వాహనం నడిపితే రూ.10,000, వేగంగా నడిపితే రూ.2,000, ఎమర్జెన్సీ వాహనాలకు దారివ్వకపోతే రూ.10 వేలు ఫైన్ వేస్తారు. ఇలా మొత్తం 63 విభాగాలకు కేంద్ర న్యాయశాఖ నుంచి ఆమోదం లభించిందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 వల్ల రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు బాధితుల సంఖ్య తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story