మరో మలుపు తిరిగిన రాజ్‌ తరుణ్‌ కారు ప్రమాద ఘటన

మరో మలుపు తిరిగిన రాజ్‌ తరుణ్‌ కారు ప్రమాద ఘటన
X

టాలీవుడ్‌ యంగ్ యాక్టర్‌ రాజ్‌ తరుణ్‌ కారు ప్రమాదం కేసు మరో మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాజ్‌తరుణ్‌కు సంబంధించిన వీడియో, ఆడియో తన వద్ద ఉన్నాయని.. కార్తీక్‌ అనే వ్యక్తి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు కొత్త వ్యవహారం తెరమీదకు వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే రాజ్ తరుణ్ పారిపోవడానికి ప్రయత్నించాడని.. తాను వెంబడించి పట్టుకున్నానని కార్తీక్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. ఆ సమయంలో రాజ్ తరుణ్ ఫుల్‌గా మద్యం తాగి ఉన్నారని తెలిపాడు. దీనికి సంబంధించి కార్తీక్‌, రాజ్‌ తరుణ్‌ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటపెట్టాడు.

రాజ్‌ తరుణ్‌తో ఫోన్ సంభాషణ తర్వాత, ఓ మహిళ తనతో మాట్లాడిందని కార్తీక్‌ మరో ఆడియో టేప్‌ బయటపెట్టాడు. ఇందులో ఆ మహిళ నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టు తెలిపాడు. మీరు తాగరా, మీకు కుటుంబాలు లేవా అని ఆ మహిళ ఆడియోలో ప్రశ్నిస్తోంది. ప్రమాదం తర్వాత పారిపోతున్న రాజ్ తరుణ్‌ను వెంబడించిన ఓ వ్యక్తి అడ్డుకున్న వీడియో బయటికొచ్చింది. 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ వీడియో ఇస్తానని, లేకపోతే సోషల్‌ మీడియాలో పెడతానంటూ కార్తీక్‌ ఫోన్‌ చేసి బెదిరించినట్లు రాజ్‌ తరుణ్‌ మేనేజర్ సినీనటుడు రాజారవీంద్ర పేర్కొన్నారు. రాజా రవీంద్ర మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కార్తీక్ ఎవరో కాదని, సినీ పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే ఓ వ్యక్తి అని రాజా రవీంద్ర తెలిపారు. కార్తీక్‌పై అతడి భార్య గృహ హింస చట్టం కింద కేసు పెట్టిందని చెప్పారు. కార్తీక్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పారు రాజా రవీంద్ర.

మూడు రోజుల కిందట నార్సింగ్ పరిధిలోని అల్కాపూరి టౌన్‌షిప్‌లో రాజ్ తరుణ్ డ్రైవింగ్ చేస్తున్న కారు వేగంగా దూసుకొచ్చి ఓ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ప్రమాదం తర్వాత తరుణ్ కారు దిగి పరుగులు పెట్టారు. నాటకీయ పరిణామాల అనంతరం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసిన రాజ్ తరుణ్.. రోడ్డు ప్రమాదాలపై యువతకు సందేశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Next Story

RELATED STORIES