Top

గంటా శ్రీనివాసరావు గెస్ట్‌ హౌస్‌ కూల్చేందుకు సిద్ధమైన అధికారులు

గంటా శ్రీనివాసరావు గెస్ట్‌ హౌస్‌ కూల్చేందుకు సిద్ధమైన అధికారులు
X

విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెస్ట్‌ హౌస్‌ కూల్చేందుకు జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. ఆ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని 24 గంటల్లో కూల్చేస్తామంటూ నోటీసులు జారీ చేశారు. హైకోర్టు స్టే ఇచ్చినా జీవీంఎసీ అధికారులు కూల్చివేతకు సిద్ధమవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఏపీలో టీడీపీ నేతల నిర్మాణాలే టార్గెట్‌గా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతతో వీటికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుంచి టీడీపీ నేతలు, వారికి సహకరించిన వారి కట్టడాలను టార్గెట్‌గా చేసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల నెల్లూరు, అనకాపల్లిలో అక్రమ నిర్మాణాల పేరుతో టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేశారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ను టార్గెట్ చేశారు. భీమిలిలోని గంటా గెస్ట్‌ హౌస్‌కి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది.

భీమిలి లో ఉన్న గంటా గెస్ట్‌ హౌస్‌ను 24 గంటల్లో కూల్చేస్తామంటూ జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే బీపీఎస్‌కి దరఖాస్తు చేసినా అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇటీవల విశాఖపట్నంలో అక్రమ కట్టడాల భవనంపై జీవీఎంసీ అధికారులు కన్నెర్ర చేశారు. ద్వారకానగర్‌లో అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు చెందిన నిర్మాణంలో ఉన్న భవానాన్ని కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ జీవీఎంసీ అధికారులు ఆ భవనాన్ని కూల్చేశారు.

అంతకుముందు నెల్లూరు శివారులోని వెంకటేశ్వరపురంలో జనార్థన్ కాలనీలో టీడీపీ నేతలకు చెందిన మూడు భవనాలను కూల్చివేశారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు, స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసుల సహకారంతో భవనాలను కూల్చివేశారు అధికారులు. ప్రజా రాజధాని కూల్చివేస్తున్నప్పుడే టీడీపీ నేతలు అందోళనలు మొదలెట్టారు. తమ ఇళ్లను కూల్చడానికే మొదట ప్రజా వేదికను కూల్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తరువాత కరకట్టపై ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిని సైతం కూల్చే ప్రయత్నం చేయగా.. కోర్టు స్టే ఇవ్వడంతో వెనుకడుగు వేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాజీ మంత్రి గంటా గెస్ట్‌ హౌస్‌ను కూల్చేసేందుకు అధికారులు సిద్ధమవుతుండడంతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES