ఎవరి దారి వారు చూసుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

ఎవరి దారి వారు చూసుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ‌లో కాంగ్రెస్ వింత ప‌రిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ ఇచ్చినా క్రెడిట్ తమదే అని చెపుతున్నా.. వ‌రుస‌గా రెండో సారి ఘోర‌ప‌రాజ‌యాన్ని తప్పలేదు. దీంతో రాజ‌కీయ నైరాశ్యం రాజ్యమేలుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై అధికారాన్ని అనుభ‌వించిన నాయ‌కులంతా.. క‌ష్టకాలంలో రాజ‌కీయంగా త‌మ దారి తాము చూసుకుంటున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు మంత్రులుగా అటు ప్రభుత్వంలోనూ.. ఇటు పార్టీలోనూ ఒక వెలుగు వెలిగిన వారంతా.. ఇప్పుడు క‌నుమ‌రుగవుతున్నారు. పార్టీ వ‌రుస ఓట‌ముల‌తో కొంద‌రు రాజ‌కీయంగా త‌మ దారి తాము చూసుకొని పార్టీ జంప్ కాగా.. మ‌రి కొంద‌రు త‌మ నియోజ‌క‌వ‌ర్గాని ప‌రిమిత‌మవుతున్నారు.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో డీకే అరుణ మంత్రిగా చ‌క్రం తిప్పారు. జిల్లాలో తిరుగులేని నాయ‌కురాలిగా.. పార్టీని లీడ్ చేశారు. ఇప్పుడు ఆమె బీజేపీలోకి వెళ్ళడంతో ఆ జిల్లాలో అంత‌టి ప్రభావం చూప‌గ‌లిగేనాయ‌కుడు లేక ద‌య‌నీయ ప‌రిస్థితినెదుర్కొంటోంది పార్టీ. రేవంత్ రెడ్డి ఉన్నా.. ఆయ‌న కొడంగ‌ల్ ఓట‌మితో మ‌ల్కాజ్ గిరికి షిఫ్ట్ అయ్యి అక్కడ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయ‌న జిల్లా పార్టీ వ్యవ‌హారాల్లో పెద్దగా జోక్యం చేసుకోవ‌డం లేదు. మెద‌క్ విషయానికొస్తే.. అక్కడ సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. గీతారెడ్డి.. దామోద‌ర రాజ‌న‌ర్సింహ లాంటి నాయ‌కులు ఇంటికే ప‌రిమిత‌మౌతున్నారు. జగ్గారెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గం సంగారెడ్డి కార్యక్రమాల‌తోనే స‌రిపెడుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలోనూ సేమ్‌ సీన్‌. ఒకప్పుడు హోంమంత్రిగా అధికారాన్ని చ‌లాయించిన స‌బితా ఇంద్రారెడ్డి.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా.. కారు పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇక ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిది ఇదే ప‌రిస్థితి. కొద్దోగొప్పో రేవంత్ రెడ్డి మ‌ల్కాజ్ గిరిలో చేసే ప్రోగ్రామ్స్‌తో పార్టీ ఉనికి చాటే ప్రయ‌త్నం చేస్తున్నారు. కేఎల్ ఆర్ త‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు త‌ప్ప పార్టీ గోడే ప‌ట్టించుకోవ‌డం లేదు. నిజామాబాద్ జిల్లాలో సురేశ్ రెడ్డి లాంటి నాయకులు కేసీఆర్ పంచ‌న చేరిపోగా.. ష‌బ్బీర్ అలీ.. మ‌ధుయాష్కీ లాంటి వారు ఇంటికే ప‌రిమిత‌మౌతున్నారు. ఆదిలాబాద్ లో పార్టీకి దిక్కూ మొక్కులేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో అన్నీ తానై న‌డిపిన సుద‌ర్శన్ రెడ్డి ఇప్పుడు పార్టీకి అంటిముట్టన‌ట్లువ్యవ‌హ‌రిస్తున్నారు.

కరీంన‌గ‌ర్ జిల్లాలో మంత్రులుగా ప‌నిచేసి అధికార ద‌ర్పాన్ని చ‌లాయించిన శ్రీ‌ధ‌ర్ బాబు.. జీవ‌న్ రెడ్డిలు కేవలం త‌మ నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మవుతున్నారు. పొన్నం ప్రభాకర్ వరుసగా మూడు ఎన్నిక‌ల్లో ఓట‌మితో.. గాంధీభ‌వ‌న్‌లో అడ‌పాద‌డ‌పా ప్రెస్ మీట్స్‌తో స‌రిపెట్టుకుంటున్నారు. హైద‌రాబాద్‌లో పార్టీ దిక్కులేని అనాథ‌లా మారింది. దానం నాగేంద‌ర్ టీఆర్ఎస్ లో చేర‌డంతో స‌గం పార్టీ ఆయ‌న‌తోనే ఖాళీ అయ్యింది. ఇక అంజ‌న్ కుమార్ యాద‌వ్ గాంధీభ‌వ‌న్ కార్యక్రమాల్లో త‌ప్పా.. సిటీలో ఎక్కడా క‌నిపించ‌డం లేదు. మ‌ర్రి శ‌శిధ‌ర్రెడ్డి ఎల‌క్షన్ క‌మీష‌న్ ఇష్యూల‌లో మీడియా ముందుకు రావ‌డం త‌ప్పా .. న‌గ‌రంలో ఆయ‌న చేసిన కార్యక్రమాలే నిల్ అనే చెప్పాలి.

వ‌రంగ‌ల్ జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణా రెడ్డి పార్టీ మారిపోయారు. పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మయ్య ఇంటికే ప‌రిమిత‌మౌతూ.. ఇటు జిల్లాలో.. అటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కాకుండా.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఖ‌మ్మం జిల్లాలో భ‌ట్టి విక్ర‌మార్క మ‌ధిర‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తూ .. జిల్లాలో అర‌కొరా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేణుకా చౌద‌రీ అస‌లు జిల్లా వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు.

న‌ల్గొండ జిల్లా నిండా ముఖ్యనాయ‌కులే ఉన్నా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ మిన‌హా జిల్లాలో ఏ ఒక్కరూ యాక్టివ్‌గా కనిపించడం లేదు. జానారెడ్డి ఇంటికే ప‌రిమితం కాగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేర‌తానంటూ ప్రక‌టించి ఊగిస‌లాట‌లో ఉన్నారు. ఆయ‌న సోద‌రుడు వెంక‌ట్ రెడ్డి ఇప్పుడు భువ‌న‌గిరి త‌ప్పా వేరే ప‌ద‌మే ఉచ్చరించ‌డం లేదు. రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్పా ఇంత‌వ‌ర‌కు పార్టీ కార్యక్రమాల్లో క‌నిపించినా దాఖ‌లాలు లేవు.

తెలంగాణ‌లోని ఉమ్మడి ప‌ది జిల్లాల్లో పార్టీని న‌డిపించేందుకు స‌రైన నాయ‌కుడు లేక.. ఉన్న వాళ్ళు యాక్టివ్‌గా లేక.. పార్టీ క్యాడ‌ర్ అయోమ‌యంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయ‌మ‌ని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పెద్దలు మ‌రి ఈ ప‌రిస్ధితుల నుంచి పార్టీని ఎప్పుడు గ‌ట్టెక్కిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story