వామ్మో ఎంత ఘాటు ప్రేమో.. నాకొద్దీ భర్త.. కోర్టుకెక్కిన భార్య..

వామ్మో ఎంత ఘాటు ప్రేమో.. నాకొద్దీ భర్త.. కోర్టుకెక్కిన భార్య..

ఏదైనా అతి అనర్థమే. ముద్దూ ముచ్చట్లు హద్దుల్లో ఉంటేనే అందమంటోంది ఆ ఇల్లాలు. మితిమీరితే కూడా బోర్ కొట్టేస్తుంది. మరీ ఇలా అయితే ఎలా తట్టుకోవడం నావల్ల కాదు. అందుకే నాకు విడాకులు కావాలి. ఈయనతో లైఫ్ రొటీన్‌గా ఉంది. దాన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను జడ్జి గారు. దానికి మీరు సహకరించాలి.. నా సమస్య తీవ్రతను మీరు సహృదయంతో అర్థం చేసుకుని తీర్పు చెప్పండి అంటూ కోర్టుకెక్కింది సతీమణి.

అన్నిటికీ తల ఊపే (మంచి) భర్త దొరికితే ఎగిరి గంతేస్తారు. కానీ ఆమెకు అదే నచ్చలేదు. యూఏఈ షరియత్‌లో చోటు చేసుకున్నఈఘటన కోర్టు వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మావారు నన్నెప్పుడూ అరవరు. మితిమీరి ప్రేమగా చూసుకుంటారు. ఆయన ప్రేమ ఆప్యాయతలతో నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నేను అడక్కపోయినా ఇంటిని శుభ్రం చేస్తారు. వంటలో సాయపడతారు. పెళ్లైన ఈ ఏడాదిలో ఒక్క రోజు కూడా అతడితో ఏ సమస్యా రాలేదు. నాతో చాలా మంచిగా ఉంటున్నాడు. అదే నాకు ఇబ్బందిగా ఉంది. ఒక్కరోజైనా అతడితో గొడవపడాలని కోరుకుంటా. ప్చ్.. అది సాధ్యం కావట్లేదు. నేను ఏ తప్పు చేసినా చిలిపిగా క్షమించేస్తాడు. రోజూ గిప్ట్‌లు ఇచ్చి నన్ను మరింత దగ్గర చేసుకుంటాడు.

నాకు నిజమైన జీవితం కావాలి. చిన్న చిన్న గొడవలు, అలకలు కావాలి. నిజానికి అలాంటివి వుంటేనే ఆలుమగల దాంపత్యం అన్యోన్యంగా ఉన్నట్లు లెక్క. ఇలా చప్పగా సాగే జీవితం నాకొద్దు. అందులో స్వీట్ థింగ్స్ నాకేమీ కనిపించట్లేదు.. జీవితాంతం ఇలానే ఉండాలంటే బోర్ కొట్టేస్తుంది. ఇలాంటి ఆయనతో సంసారం చేయడం చాలా కష్టం. అందుకే విడాకులు ఇప్పించండి అని అంటోంది ఆ ఇల్లాలు. ఆమె మాటల్ని ఆ సాంతం విన్న జడ్జి ప్రేమగా ఉండడం సమస్య ఎలా అవుతుంది తల్లీ.. మరోసారి ఆలోచించుకో అంటూ ఆమెకు సూచిస్తూ కేసును వాయిదా వేశారు.

ఇక భర్తగారి వెర్షన్ మరోలా ఉంది.. ఇందులో నా తప్పేముంది. భార్యని ప్రేమించడం తప్పంటారా. అందరూ నాకు సలహాలు ఇస్తున్నారు. ఆమె ఏం కోరినా తిరస్కరించమంటున్నారు. కానీ నేను అలా చేయలేను. నేనెప్పుడూ మంచి భర్తగా ఉండాలని భావిస్తాను. ఓ రోజు నేను వెయిట్ ఎక్కువ వున్నాని చెప్పింది. దాంతో వెంటనే డైటింగ్, ఎక్సర్‌సైజ్‌లు చేసి బరువు తగ్గాను. ఆ టైమ్‌లో నేనసలు అనుకోలేదు నా మీద ప్రేమ తగ్గుతుందని.. అని అమాయకంగా చెబుతున్నాడు. దయచేసి విడాకులు వెనక్కి తీసుకోమని భార్యమణిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆమెకు మీరైనా చెప్పండి అని కోర్టును కోరుతున్నాడు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి.. పెళ్లైన ఏడాది కాలంలోనే భార్యా భర్తల సంబంధంపై ఒక అవగాహనకు రాలేం. అందుకే ఈ కేసును మరికొన్ని రోజులకు వాయిదా వేస్తున్నాం అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story