అరుణ్ జైట్లీ ఇక లేరు

అరుణ్ జైట్లీ ఇక లేరు

కమలదళం మరో సీనియర్ నాయకున్ని కోల్పోయింది. బీజేపీ అగ్రనాయకుడు, కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఇకలేరు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న జైట్లీ, ఆస్పత్రి లో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. మూత్రపిండాలు, శ్వాసకోశ సమస్యలతో సతమతమైన జైట్లీని బతికించడానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడంతో గతవారం జైట్లీని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఎయిమ్స్‌ వైద్యులు, జైట్లీకి అత్యాధునిక వైద్యం అందించారు. ఆ చికిత్సకు మొదట్లో జైట్లీ స్పందించారు. కానీ, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దిగజారింది. జైట్లీ విషయం తెలుసుకొని రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాధ్‌ సింగ్‌లు ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీని పరామర్శించారు. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ, బీఎస్పీ చీఫ్ మాయావతి సహా వివిధ పార్టీల నాయకులు కూడా ఎయిమ్స్‌కు వెళ్లి జైట్లీని చూసి వచ్చారు. జైట్లీ ఆరోగ్యం మరింత విషమించింది. తరువాత జైట్లీని లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచారు. జైట్లీకి ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రాన్‌ ఆక్సిజనేషన్‌ను అమర్చారు. కిడ్నీలు, గుండె పనితీరు మందగించినప్పుడు ఈసీఎంఓను ఉపయోగిస్తారు. ఇన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ సమస్య నుంచి బయటపడిన తర్వాత మరో సమస్య వచ్చింది. మృదుకణజాల కేన్సర్‌తో జైట్లీ సతమతమయ్యారు. ఆ వ్యాధికి అమెరికాలో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదు. రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించారు. స్వయంగా ప్రధాని మోదీ అడిగినప్పటికీ, ఆరోగ్యం సరిగా లేనందున తన వల్ల కాదంటూ తిరస్కరించారు. ఇటీవల ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందు తూనే కన్నుమూశారు.

Tags

Read MoreRead Less
Next Story