పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

పోలవరంపై సీన్‌ రివర్స్‌ అవుతోంది.. రీ టెండర్లకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి చీవాట్లు పడుతున్నాయి.. మొన్న ప్రాజెక్టుపై స్పందించిన కేంద్రం.. తాజాగా ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా తప్పు పట్టింది.. ఈ ఎపిసోడ్‌పై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ షెకావత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ తీరును మరోసారి తప్పు పట్టింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో పోలవరానికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పోలవరం అథారిటీ స్పష్టం చేసింది. మొత్తం 12 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల జరిగే నష్టాలను నివేదికలో పీపీఏ సవివరంగా పొందుపరిచింది. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశముందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. జాప్యం కొనసాగితే పోలవరం ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్‌ ఆలస్యమైతే పట్టిసీమ, పురుషోత్తపట్నం భారం పడుతుందని, రాష్ట్ర ప్రభుత్వంపై అధికంగా ఉంటుందని పీపీఏ చెబుతోంది.

ఇప్పటికే ప్రాజెక్ట్‌ నాలుగేళ్లు ఆలస్యమైందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని నివేదికలో పేర్కొంది.. తక్కువ ధరకు కాంట్రాక్టర్‌ వస్తారన్న నమ్మకం కూడా లేదని, ప్రాజెక్ట్‌ ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని పీపీఏ తెలిపింది. తక్కువ ధరకు వచ్చే కాంట్రాక్టర్లు నాణ్యమైన పనులు చేస్తారన్న నమ్మకం లేదని తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్ట్‌ను యధాతథంగా కొనసాగించడం మంచిదని పీపీఏ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పీపీఏ నివేదిక పంపింది.

మరోవైపు పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుపట్టింది.. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం టెండర్ల రద్దుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని.. కోర్టు స్టేను అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని షెకావత్‌ అన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బు చెల్లించేది కేంద్ర ప్రభుత్వమని.. ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు కేంద్రానికి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణ బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదన్నారు. పోలవరంపై తీసుకునే ప్రతి నిర్ణయమూ కేంద్రానికి చెప్పాల్సిందేనన్నారు. కేంద్రం పని కేంద్రం చేస్తుంది. రాష్ట్రం పని రాష్ట్రం చేయాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Next Story

RELATED STORIES