అమ్మాయిలూ జాగ్రత్త.. ఉద్యోగం ఇప్పిస్తానని న్యూడ్ ఫొటోలు పంపించమంటూ..

అమ్మాయిలూ జాగ్రత్త.. ఉద్యోగం ఇప్పిస్తానని న్యూడ్ ఫొటోలు పంపించమంటూ..

డబ్బు సంపాదించాలి.. అక్రమంగానైనా సరే.. అడ్డదారులు తొక్కైనా సరే. ఎమ్‌టెక్ చదివి పేరున్న సాప్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసుకుంటూ కూడా నీచమైన ఆలోచనలు చేశాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఫేస్‌బుక్‌లో అర్చనా జగదీష్ పేరుతో ఓ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆమె ఓ కన్సల్టెన్సీ కంపెనీ HR అని అందులో పేర్కొన్నాడు. ఎవరికైనా ఉద్యోగం కావాలంటే మెసేజ్ చేయమని చెప్పాడు. అది నిజమనుకుని చాలా మంది అమ్మాయిలు, మహిళలు అతడికి మెసేజ్‌లు పెడుతుండేవారు. వాటిని చూసి వాళ్ల ఫోన్ నెంబర్ తెలుసుకుని కాల్ చేసేవాడు. అర్చనా జగదీష్ తాలూకా అని చెప్పి వారిని ఇంటర్వ్యూ పేరుతో అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసేవాడు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పేవాడు. అలా వారిని మాటల్లో పెట్టి అలాంటి ఉద్యోగాలు చేయాలంటే మంచి ఫిజిక్ ఉండాలి.. అందంగా ఉండాలి.. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియాలంటే మీ నార్మల్ ఫొటోలతో పాటు మీ న్యూడ్ ఫోటోలు కూడా పంపించమని చెప్పేవాడు.

మంచి ఫిజిక్ ఉంటే మంచి జీతం వస్తుందని నమ్మించేవాడు. మాయగాడి వలలో పడిన కొందరు అమ్మాయిలు, మహిళలు అతడు కోరిన విధంగా ఫోటోలు పంపించేవారు. అలా వాళ్లతో పరిచయం పెంచుకునేవాడు. అతడిని నమ్మి దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది మహిళలు, యువతులు తమ న్యూడ్ పిక్స్ పంపించినట్లు సైబరాబాద్, మియాపూర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్క హైదరాబాదులోనే 60 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అంతటితో ఆగక.. ఫొటోలు పంపించిన అమ్మాయిలకు ఫోన్లు చేసి అడిగినంత డబ్బివ్వకపోతే ఫోటోలు ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించేవాడు. దాంతో భయపడిపోయిన చాలా మంది అమ్మాయిలు అతడికి డబ్బులు కూడా పంపించారు. ఈ విధంగా మోసపోయిన ఓ యువతి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story