తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ను భారీ వర్షం కుదిపేసింది. సాయంత్రం వేళలో ఉన్నట్టుండి కురిసిన వర్షానికి జన జీవనం స్తంభించింది. వర్షానికి తోడు భారీగా గాలులు వీచడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ద్విచక్ర వాహనదారులు ఫ్లై ఓవర్ల కింద గుమిగూడారు. దాదాపు గంట పాటు నగరాన్ని వర్షం కుదిపేసింది. తెలంగాణ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు ప్రాంతాల్లో 6-9 సెం.మీ వర్షపాతం కురిసింది.

ఏపీలో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షం కురిసింది. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో వర్షం పడింది. విశాఖలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. బీచ్ రోడ్డులో మోకాళ్ల వరకు నీరు నిలిచిపోవటంతో వాహనదారులు తిప్పలు పడ్డారు. మద్దిలపాలెం ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ఓ భవనంపై ఉన్న సెల్‌టవర్‌పై పిడుగు పడడంతో.. అది పేలి ఒక్కసారి భారీగా మంటలు వ్యాపించాయి. పక్కనే పెట్రోల్‌ బంక్‌ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో.. అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

శనివారం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓ వైపు వర్షాలు కురిస్తున్నాయని ఆనందం ఉన్నా.. గోదావరి పరివాహక ప్రాంత రైతుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. మొన్నటి వర్షాలకే వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. మరోసారి వరద వస్తే పంటలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

Tags

Read MoreRead Less
Next Story