దొనకొండ భూములపై బడా నేతల చూపు.. అసలు అక్కడ ఏముంది?

దొనకొండ భూములపై బడా నేతల చూపు.. అసలు అక్కడ ఏముంది?

ఏపీ రాజధాని అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మంత్రి బొత్స వ్యాఖ్యలతో త్వరలోనే రాజధాని మారబోతుందని .. ఆ మేరకు ప్రకటన రాబోతుందంటూ ప్రచారం ఊపందుకుంది. దొనకొండను ఏపీ రాజధాని మారుస్తున్నారంటూ ప్రచారంతో బడా నేతల చూపులు అక్కడి భూములపై పడ్డాయి. అసలు ఏముంది దొనకొండలో.. ఎందుకు మాట్లాడితే దొనకొండ అంటున్నారు.. అసలు ఏమిటీ కథా...కమామీషు..?.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తథ్యం అన్న మరుక్షణం.. ఏపీ రాజధానిగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ అని ముమ్మరంగా ప్రచారం జరిగింది. అటు రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాల ఎంపికకు నియమించిన శిమరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర పర్యటలో భాగంగా దొనకొండలో పర్యటించి ఇక్కడా చాలా ప్రభుత్వ భూమి ఉంది...రెండవ ప్రపంచ యుధ్ద సమయంలో నిర్మించిన విమానాశ్రయం ఉందని పేర్కొంది. అయితే శివరామకృష్ణన్ కమిటీ ఏక్కడ రాజధాని పెట్టాలో చెప్పకుండానే తన పని ముగించుకు వెళ్లింది.

రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధాని ప్రకటించి భూసేకరణ జరిపి తాత్కాలిక భవనాలను నిర్మించింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటిని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించింది. దీనితో దొనకొండ పేరు మరుగున పడింది. కాకపోతే దొనకొండలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు ప్రభుత్వం సంకల్పించింది. హెలీకాప్టర్ల రిపేరు పరిశ్రమ, వాహనాల సామర్ధ్యం పరీక్షించే పరిశ్రమ ఇలా పలు రకాల పరిశ్రమల పేర్లు చెప్పారు తప్ప.. అక్కడికీ వచ్చిందీ లేదు.. ఏ పరిశ్రమ పెట్టింది లేదు.

పాత ప్రభుత్వం పోయింది...కొత్త ప్రభుత్వం వచ్చింది. పాత ప్రభుత్వ నిర్ణయాలను తిరగతోడే క్రమంలో ఇప్పటికే పోలవరం...విద్యుత్ ఒప్పందాలు...అన్న క్యాంటీన్లు ఇలా ప్రతి అంశంలోనూ గత ప్రభుత్వం చేసిన వాటిని కాదని కొత్తగా చేయాలన్న తాపత్రయంలో భాగంగానే రాజధానిని కూడా మార్చడానికి పథక రచన చేసింది. అమరావతి ముంపు ప్రాంతంలో ఉంది. అక్కడ రాజధాని ఏలా నిర్మిస్తారు...దీనిపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకంటుందని ఒక మంత్రిగారు సెలవివ్వడంతో మళ్లీ దొనకొండ ప్రాణం పోసుకుంది.

రాజధాని అనగానే ఎందుకు దొనకొండ పేరు ప్రస్తావనలోకి వస్తోంది. అక్కడ భూమి అందుబాటులో ఉంటే చాలా... ఇంక ఏమీ అక్కరలేదా.. కనీస మౌలిక సదుపాయాలైన రవాణా.. నీటి వసతి, వసతి సౌకర్యాలు వంటి వాటి గురించి ఎవ్వరూ ఎందుకు ఆలోచన చేయడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం రియల్ బ్రోకర్ల హడావుడి తప్ప మరొకటి కాదని చెప్పక తప్పదు. ప్రకాశం జిల్లానే వెనుకబడిన ప్రాంతం అందులోనూ వెనుకబడిన ప్రాంతం దొనకొండ. వర్షాకాలంలో కూడా తాగునీటిని ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిందే. మండల కేంద్రంగా ఉన్న దొనకొండలో కనీస వసతులు నిల్‌.. దీనికి సమీపంలో ఉన్న పెద్ద పట్టణం ఒంగోలు లేదా... వినుకొండ మాత్రమే..

అందుబాటులో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే రాజధాని కట్టేస్తారా.. ఇతర మౌలిక సదుపాయాల కల్పన మాట ఏమిటి.. ఇప్పటికి ఇప్పుడు రహదారులు.. మంచినీటి సౌకర్యం...వసతి ఎలా కల్పిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.. దొనకొండలో దాదాపు 40వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మరి ఇక్కడ ప్రైవేట్ భూమి ఎంత ఉంది...ఇప్పటివరకు జరిగిన ప్రచారాల్లో చేతులు మారిన భూమి ఎంత...ఇంకా ఎంత మిగిలింది. .గతంలో ఇక్కడ భూములు కొన్న బడాడాడులు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడానికి వేసిన ఎత్తుగడ అయితే కాదు కదా...అనే అనుమానాలు స్ధానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వెనుకబడిన ప్రకాశం జిల్లాలోని దొనకొండలో రాజధాని రావడం వల్ల ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. కాకపోతే పరిస్దితులను వాస్తవ థృక్పధంతో ఆలోచించాలి. భూమి ఒక్కటే సరిపోదు కదా.. ..గతంలో ప్రకటించినట్లుగానే పారిశ్రామిక ప్రాంతంగా దీనిని అభివృద్ది చేస్తే ఈ ప్రాంతానికి మరింత మేలు జరుగుతుందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు..

Tags

Read MoreRead Less
Next Story