అమరావతిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స

అమరావతిపై మరోసారి మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. రాజధాని ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదని.. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాజధాని ప్రాంతానికి వరద ముంపు ఉందని బొత్స పునరుద్ఘాటించారు. ఎనిమిది లక్షల క్యూసెక్కులకే ముంపునకు గురైందని.. 11 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అమరావతి విషయంలో పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ అర్ధాన్ని తలపిస్తున్నాయన్నారు.
రాజధాని నిర్మాణంపై మొన్నటి బొత్స వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూనే వరద ముంపు ముప్పును ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయంగా దీనిపై పెను దుమారం చెలరేగడంతో.. తర్వాత తన మాటల్ని వేరే రకంగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానన్నారు. ఇక ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్మాణం ఆంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. విజయనగరం పట్టణంలోని రాజీవ్ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి వార్డు, గ్రామవాలంటీర్ల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధానిపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com