ఇల్లు ఇప్పుడు కొనడమే మంచిది .. లేదంటే..

ఇల్లు ఇప్పుడు కొనడమే మంచిది .. లేదంటే..
X

ఇల్లు కొనాల్రా.. ఇంట్లో వాళ్ల గొడవ పడలేకపోతున్నా.. అందరికీ ఇళ్లున్నాయి.. మనకి ఇల్లు లేదు అనే ఇల్లాలి నస ప్రతి ఇంట్లో ఉంటుందేమో. అయితే బడ్జెట్ అనుకూలంగా ఉన్నప్పుడు కొనుక్కోవచ్చులే అనుకుంటే మాత్రం చూస్తుండగానే మీరు కొనాలనుకుంటున్న ఏరియాలో ఇళ్ల ధరలు ఇల్లెక్కి కూర్చుంటాయి. అందుకే ముందే మేల్కొంటే మంచిది. కళ్ల ముందే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటుంది సంవత్సరం తిరిగే సరికి గృహ ప్రవేశాలు కూడా అయిపోతాయి. అయ్యో అప్పుడు కొందామనుకున్నాం రేటెక్కువని ఆగిపోయాం. ఇప్పుడు కొందామంటే ఆ రేటుకి రానే రావట్లేదు. ఇలా అనుకోవడం పరిపాటి. అందుకే ఒకవేళ ఇల్లు కొనాలనే ఆలోచన ఉంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయొద్దు. అంటే వాయిదా వేయొద్దని.. ఉదాహరణకు స్క్వేర్‌ ఫీట్ 3,300 లు ఆరు నెలల కిందట వుంటే ఇప్పుడది 3400 చెప్పేస్తారు. అదేమంటే డిమాండ్ అలా ఉందండి. మేం అప్పుడే చెప్పాం కదా. ఇప్పుడే బుక్ చేసుకోండి అని అంటున్నారు. బేస్ పడగానే బుకింగ్‌లు చేసేసుకుంటున్నారు. కొనాలనుకుంటున్న ఏరియాలో విస్తృతంగా ఎంక్వైరీ చేయాలి. రేట్లు ఎలా ఉన్నాయో ఓ అంచనాకు రావాలి.

కొత్త ఇల్లు కొనాలనుకుంటే నిర్మాణంలో ఉన్నప్పుడే కొనుగోలు చేయడం ఉత్తమం. నిర్మాణం మొదట్లోనే కాబట్టి నచ్చినట్టుగా చెప్పి చేయించుకోవచ్చు. కావలసిన ఫేసింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉండొచ్చు. ఇల్లు పూర్తయిన తరువాత తీసుకుందామనుకుంటే మొదట చెప్పిన రేటుకి ఇప్పటి రేటుకి దాదాపు 30 శాతం వ్యత్యాసం వుంటుంది. నిర్మాణంలో ఉండగానే కొనుగోలు చేసినట్లైతే మీ ఇంటి ఆస్తి విలువ దాదాపు 30 శాతం పెరిగినట్లే. హౌసింగ్ లోన్ ద్వారా ఇల్లు తీసుకోవాలనుకున్నట్లయితే నిర్మాణ సమయం నుంచే ఈఎంఐ చెల్లించాలంటే భారంగా మారుతుంది. చెప్పిన గడువుకు ఇవ్వకపోతే ఓ వైపు ఉంటున్న ఇంటికి అద్దె కట్టాల్సి వస్తుంది.

మరో వైపు కొనుగోలు చేసిన ఇంటికి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అందుకే నిర్మాణ దారుడు ఏ సమయానికి ఇల్లు ఇస్తాడు అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీసుకోవడం మంచిది. రెడీ టూ ఆక్యూపై ఇళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. నగరాల్లో అద్దెలు భారంగానే మారుతున్నాయి. అదే అద్దెకు కొంచెం మొత్తం జోడిస్తే గృహరుణ వాయిదాలకు సరిపోతుంది. ఓ ఇంటి వారైపోతారు.. ఆలోచించండి.. ఈరోజే ఇల్లాలిని తీసుకుని వెళ్లి వెతకండి.

Next Story