సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఆశా వర్కర్ల పిలుపు

సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఆశా వర్కర్ల పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో ఆశావర్కర్ల అరెస్టులు పలుచోట్ల ఉద్రిక్తతకు దారి తీశాయి. ఇవాళ ఛలో అమరావతికి పిలుపిచ్చిన వారంతా.. రైళ్లు, బస్సుల్లో విజయవాడకు బయలు దేరారు. ఐతే.. వీరిని స్టేషన్లలోనే అడ్డుకున్నారు పోలీసులు. శాంతిభద్రతల కారణం చూపిస్తూ ఎక్కడికక్కడ నిలువరించారు. తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుతూ.. ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఇవాళ అమరావతిలో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. విజయనగరం, గజపతినగరం రైల్వే స్టే షన్లలో రాయగడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు వచ్చిన ఆశ వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 300 మంది ఆశ వర్కర్లు అమరావతి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు తరలి వచ్చారు. అయితే.. ఈ సమాచారమందుకున్నపోలీసులు రైలు ఎక్కుతున్నజిల్లా అధ్యక్షురాలు సుధారాణితో పాటు మరి కొంత మంది ఆశ వర్కర్లను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

విజయనగరంలోనే కాదు.. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వేల మందిని అరెస్టు చేశారన్న వార్తలపై ఆశా వర్కర్ల సంఘం తీవ్రంగా మండిపడుతోంది. ధర్నా కోసం విజయవాడ వెళుతున్నారని తెలిసి గ్రామాలు, పట్టణాలలోని ఆశ వర్కర్ల ఇళ్లకు వెళ్లి మరీ అరెస్ట్‌ చేయడం దారుణమని వారు ఆగ్రహంతో ఉన్నారు. గత ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని.. జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కోర్కెల సాధన కోసం నిరసన తెలుపుతున్న వారిని అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌ జీతాలు బకాయిలు విడుదల చేయాలని.. గ్రేడింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story