నేరస్తుల అప్పగింత బిల్లుపై వ్యతిరేకత.. ఆగని నిరసనలు..

నేరస్తుల అప్పగింత బిల్లుపై వ్యతిరేకత.. ఆగని నిరసనలు..

ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు నెలలుగా హాంకాంగ్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం మెట్టు దిగడం లేదు.. ఆందోళనకారులు పట్టువీడటం లేదు.. నిత్యం తమ నిరసనలను ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.. నేరస్తుల అప్పగింత బిల్లుపై అక్కడివారంతా భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.. నిరసనలను నిలువరించేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆందోళనకారులు వెనక్కు తగ్గడం లేదు.. పైగా రోజురోజుకూ మరింత తీవ్రతరం చేస్తున్నారు.. దీంతో హాంకాంగ్‌లో నిత్యం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.. భారీ ప్రదర్శనల కోసం నగరానికి వస్తున్న ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి బలగాలు.. రైలు సర్వీసులను కూడా నిలిపివేసి ఆందోళనకారులంతా ఒక చోటుకు చేరకుండా అడ్డుకుంటున్నాయి.. మరోవైపు సీసీ కెమెరాలపై పెట్రోల్‌ బాంబులు విసిరిన ఆరోపణలపై 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

నేరస్థులను చైనా సహా ఇతర దేశాలకు అప్పగించే బిల్లును హాంకాంగ్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. తైవాన్‌కు చెందిన ఓ హత్య కేసు నిందితుడు హాంకాంగ్‌లో తలదాచుకున్నట్లు ఆరోపణలున్నాయి. సరైన చట్టం లేకపోవడంతోనే హాంకాంగ్‌ ప్రభుత్వం అతడిని అప్పగించలేని పరిస్థితి నెలకొంది. ఒక దేశం, రెండు వ్యవస్థలు ఉండడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం నేరస్థుల అప్పగింత చట్టమే అని భావించి చైనా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టించింది. అయితే ఈ బిల్లు ముసుగులో చైనా ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుందని ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం నిందితులను అప్పగించే చట్టం ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.. హాంకాంగ్ సీఈఓ క్యారీ లామ్ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నండగా.. బిల్లును అధికారికంగా ఉపసంహరించాలనేది మరో డిమాండ్‌. పోలీసు అకృత్యాలపై కమిటీ వేయాలని.. నిరసనకారులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story