పదిరోజులుగా మూగబోయిన మొబైల్స్‌.. ప్రియాంక ట్వీట్‌

పదిరోజులుగా మూగబోయిన మొబైల్స్‌.. ప్రియాంక ట్వీట్‌
X

జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయి.. సామాన్య జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని ప్రభుత్వం చెబుతోంది.. తాజా పరిస్థితులను గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మీడియాకు వివరించారు.. గత పదిరోజుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన చెప్పారు. ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ ఫోన్‌ సేవలను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ సమర్ధించారు. ఈ నిర్ణయం ప్రజల ప్రాణాలను నిలపడానికి సహాయపడిందన్నారు. గతంలో కాశ్మీర్‌లో సంక్షోభం ఏర్పడినప్పుడు తొలి వారంలోనే 50 మంది మరణించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల ప్రాణాలకు నష్టం కలగకూడదన్నదే తమ వైఖరి అని అన్నారు. పది రోజులుగా మొబైల్‌ ఫోన్లు లేవని, రాష్ట్రం త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటే ఆంక్షలను ఎత్తివేస్తామని గవర్నర్‌ సత్యపాల్‌మాలిక్‌ తెలిపారు.

ఇక కేంద్రం ఆదేశాల మేరకు శ్రీనగర్‌లోని సివిల్‌ సెక్రటేరియేట్‌ భవనంపై నుంచి ప్రత్యేక జెండాను అధికారులు తొలగించారు. శనివారం వరకు సెక్రటేరియట్‌పై రెండు పతాకాలు కనిపించగా.. ఆ వెంటనే ప్రత్యేక జెండాను అధికారులు తొలగించారు. అక్టోబర్‌ 31 నుంచి జమ్ముకాశ్మీర్‌, లఢక్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్న నేపథ్యంలో ఆ సమయంలోనే అక్కడి ప్రత్యేక జెండాను తొలగిస్తారని అందరూ భావించినా.. అధికారులు ముందుగానే ఆ పని కానిచ్చేశారు. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రత్యేక జెండాను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు.

అటు కశ్మీర్‌లో ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందంటూ విపక్షాలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నాయి.. దీనికంటే దేశ ద్రోహం మరొకటి లేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. దీనిపై గళమెత్తడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె ట్వీట్‌ చేశారు. అఖిలపక్ష బృందాన్ని వెనక్కు పంపడాన్ని ఆమె తీవ్రంగా తప్పు పట్టారు.. తన ట్వీట్‌కు వీడియోను కూడా ట్యాగ్ చేశారు.. ఈ వీడియోలో శ్రీనగర్‌కు చెందిన ఓ మహిళ, ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాహుల్‌కు వివరిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.. ఇలా ఇంకెంత కాలం సాగుతుందంటూ ట్విట్టర్‌లో కేంద్రంపై ఘాటైన విమర్శలు చేశారు ప్రియాంక గాంధీ.

ఇక జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలకు గృహ నిర్బంధం నుంచి విముక్తి ఇప్పట్లో లభించే పరిస్థితి కనిపించడం లేదు.. బహిరంగ సమావేశాలు, రాజకీయ చర్యలకు పాల్పడకుండా ఉంటే నిర్బంధం నుంచి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోంశాఖ షరతు విధించినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సదరు నేతలు ససేమిరా అన్నట్లు సమాచారం.. తమపోరాటం కొనసాగిస్తామని ఇద్దరు నేతలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కేంద్ర ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించడానికి మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బృందం ఈ నెల 27 నుంచి కశ్మీర్‌లో పర్యటించనుంది. రెండు రోజుల పాటు కాశ్మీర్‌ లోయను ఈ బృందం సందర్శించనుందని కేంద్ర మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. ఇక్కడ విద్యాసంస్థలు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు తెరుచుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత జమ్ము, లఢక్‌లోనూ బృందం పర్యటించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Next Story

RELATED STORIES