ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి సమస్యకు 'సీడ్ సైక్లింగ్‌'తో చెక్..

ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి సమస్యకు సీడ్ సైక్లింగ్‌తో చెక్..

ఆహారంలో మార్పులు, డాక్టర్లు ఇచ్చిన మందులు ఏవీ పెద్దగా పనిచేయట్లేదు. సమస్య అలానే ఉంది. మందులు ఎక్కువ కాలం వాడితే బరువు పెరుగుతుందోమో అనే భయం పట్టుకుంటుంది. పీసీఓడీ సమస్యను నివారించే మార్గంలో సీడ్ సైక్లింగ్ పద్దతిని అమలు చేయమంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పద్దతిని అనుసరిస్తే పీరియడ్స్ ‌కూడా రెగ్యులర్‌గా వచ్చి పీసీఓడీ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ రోజుల్లో అధిక శాతం మహిళలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారు. జీవన విధానంలో మార్పులు ఇందుకు కారణమవుతున్నాయి. కొన్ని రకాల సీడ్స్ (గింజలు) తీసుకోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత ఏర్పడి పీసీఓడీ సమస్య తగ్గే అవకాశం ఉంది.

ఈ గింజల్లో ప్రధానంగా ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటియాసిడ్లే కాకుండా వీటిలో ఉండే జింక్, సెలీనియం ఎలిమెంట్స్ వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. సీడ్ సైక్లింగ్ అంటే ఒక పద్దతి ప్రకారం గింజలను తీసుకోవడం. గుమ్మడి గింజలు, అవిసె గింజలను మొదటి రోజు నుంచి 14 రోజుల వరకు రోజూ ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి. మొదటి రోజు అంటే పీరియడ్స్ ప్రారంభమైన రోజు నుంచి 14 రోజుల వరకు. ఇక 15వ రోజు నుంచి 28వ రోజు వరకు నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి. అయితే వీటిని తీసుకునే విధానంలో ఒకేసారి మొత్తం తీసుకోకుండా మూడు పుటలా మూడు భాగాలు చేసుకుని తీసుకోవాలి.

ఒకవేళ గింజల రూపంలో తీసుకోలేని వారు పొడి చేసుకుని మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. గింజలు తీసుకోవడంతో పాటు వ్యాయామం, సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇలా చేస్తుంటే పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంతో పాటు, జుట్టు ఆరోగ్యంగానూ పెరుగుతుంది. వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది. బరువు తగ్గుతారు. పీరియడ్స్‌కు ముందు వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సంతానలేమి, మెనోపాజ్‌‌లో ఉన్నవారు, గర్భసంచి తొలగించిన వారు కూడా గింజలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story