జగన్‌ సర్కారును బీజేపీ టార్గెట్‌ చేసిందా?

జగన్‌ సర్కారును బీజేపీ టార్గెట్‌ చేసిందా?

ఏపీ రాజధాని అమరావతి మార్పుపై మంత్రి బొత్సవాఖ్యలతో ఇప్పటికే రాష్ట్రంలో కలకలం రేగుతోంది. దీనిపై సీఎం జగన్‌ స్పష్టత ఇవ్వాలంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తనను కలిసేందుకు వచ్చిన రాజధాని రైతులు, రైతు కూలీలకు అండగా నిలుస్తామన్నారు. వారి ఆందోళనలు తెలుసుకునేందుకు మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు.

అటు.. నాలుగు రాజధానులుంటాయంటూ ట్విస్ట్‌ ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ వెంటనే మాట మార్చేశారు. సీఎం జగన్‌.. రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దు చేసి నాలుగు ప్రణాళిక బోర్డులు తయారు చేస్తున్నారని, అందుకే నాలుగు రాజధానులు చేస్తారని అనుకున్నట్టు కవర్‌ చేశారు. కేంద్ర హైకమాండ్‌ ఆదేశాలతో ఆయన మాట మార్చినట్లు తెలుస్తోంది.

మరోవైపు అమ‌రావ‌తి మార్పును తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు ఏపీబీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిది ర‌ఘునాథ బాబు. అమరావతి తుది డిజైన్ పూర్తైందని, అనేక కార్యాల‌యాల నిర్మాణం జరిగిందన్న ఆయన... ఇప్పుడు రాజధాని మార్చడం సరికాదన్నారు. టీజీ వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌తమన్నారు. సీఎం జగన్‌... రాజధానిపై స్ప‌ష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

టీజీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు బీజేపీ నేత రఘురాం. పార్టీలో ఉన్నప్పుడు అంతా ఒక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారాయన. రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. అమరావతిలో అవినీతిని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మొత్తంగా... అమరావతి తరలింపును వ్యతిరేకిస్తున్నారు బీజేపీ నేతలు. జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయాలంటున్న కమలనాథులు.. వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

Read MoreRead Less
Next Story