ఛీటింగ్.. లక్కీ డ్రాలో కారు వచ్చిందని రూ.16 లక్షలు..

ఛీటింగ్.. లక్కీ డ్రాలో కారు వచ్చిందని రూ.16 లక్షలు..

లక్కీ డ్రాలో కారు వచ్చిందని నమ్మించి లక్షలు దోచుకున్నారు మాయగాళ్లు. మోసపోయామని ఆలస్యంగా గుర్తించిన వ్యాపారి లబోదిబోమంటున్నాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం గ్రామానికి చెందిన చందా అంజయ్య అనే వ్యాపారి మాయగాళ్ల భారిన పడి 16లక్షల 33వేల రూపాయలు పోగొట్టుకున్నాడు.

అంజయ్య అప్పడప్పుడూ ఆన్ లైన్ షాపింగ్‌ చేస్తుంటారు. ఇందులో భాగంగా ఇటీవల నాఫ్తాల్ అనే కంపెనీ నుంచి ఓ పార్సిల్ వచ్చింది. అందులో ఉన్న కార్డు స్క్రాచ్ చేయగా మహీంద్రా కారు గెలుచుకున్నట్టు వచ్చింది. అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కు ఫోన్ చేశాడు. దీంతో మీరు కారు గెలుచుకున్నారని.. కొద్దిరోజుల్లో డెలివరీ చేస్తామన్నారు. అయితే అంతరాష్ట్ర పన్నుల కోసం రూ. 25వేలు చెల్లించాలని చెప్పారు. దీంతో ఆయన భార్య ఖాతా నుంచి గూగుల్ పే ద్వారా వాళ్లు అడిగిన మొత్తం చెల్లించాడు. ట్రాన్స్ పోర్టు నిమిత్తం మరోసారి రూ.64వేల 5వందలు కట్టమన్నారు. మూడురోజుల్లో కారు డెలివరీ అవుతుందని చెప్పిన మోసగాళ్లు కంటైనర్ ప్రమాదానికి గురైందని.. తిరిగి పంపామని... కారు ఇవ్వలేమన్నారు. కారుకు సమానమైన క్యాష్ ఇస్తామని.. ఇందుకోసం టిడిఎస్ కట్టాలని చెప్పి మళ్లీ రూ.61వేలు ఇవ్వాలన్నారు. వారి మాటలు నమ్మిన అంజయ్య.. అలా పలుమార్లు మొత్తం 16లక్షలకు పైగా చెల్లించాడు.

చివరకు మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. 16లక్షల రూపాయలకు పైగా ఆన్ లైన్ ద్వారా చెల్లించామని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాదితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. లక్కి డ్రాల పేరుతో అపరిచిత ఫోన్లకు స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story