చిదంబరానికి మరో షాక్‌

చిదంబరానికి మరో షాక్‌

కాంగ్రెస్ నేత, కేంద్రమాజీమంత్రి పి.చిదంబరం బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు. చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. కస్టడీ పొడిగింపునకే సీబీఐ ప్రత్యేక కోర్టు మొగ్గుచూపింది. చిదంబరం కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు చిదంబరం సహకరించడం లేదని, మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని కోరారు. ఈనెల 22 నుంచి 26 వరకు విడతల వారీగా చిదంబరాన్ని ప్రశ్నించామని, ఐతే ఆశించిన సమాధానాలు రాలేదని తెలిపారు. INX కేసుతో చిదంబరానికి సంబంధముందని పునరుద్ఘాటించిన సీబీఐ, నిందితుల మధ్య సాగిన ఈ-మెయిళ్లను కోర్టుకు సమర్పించింది. నిందితులను ముఖాముఖి కూర్చోబెట్టి విచారణ జరిపితే కుట్ర మొత్తం బయటపడుతుందని వాదించింది. ఈ వాదనను చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తోసిపుచ్చారు. విచారణకు చిదంబరం సహకరించడం లేదనే ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఐదు దేశాలకు పంపించిన లెటర్ ఆఫ్ రొగేటరీలకు సమాధానం వచ్చే వరకు చిదంబరాన్ని కస్టడీలో ఉంచుకోవడం కుదరదని వాదించారు. కస్టడీని పొడిగించకుండా బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, సీబీఐ వాదననే సమర్దించింది. బెయిల్ ఇవ్వడానికి అంగీకరించని కోర్టు, ఆగస్టు 30 వరకు చిదంబరం కస్టడీని పొడిగించింది.

సుప్రీంకోర్టులో కూడా చిదంబరానికి ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. చిదంబరం తరఫున సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు వాదనలు వినిపించారు. INX మీడియా కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీని అక్రమంగా ఇరికించారని సిబల్ ఆరో పించారు. చిదంబరంపై అవినీతి ముద్ర వేయడానికి కుట్ర జరుగుతోందన్నా రు. FIPB అనుమతి ఇస్తేనే చిదంబరం ఆమోదం తెలిపారని, అంతకుమించి ఆయనకెలాంటి సంబంధం లేదని వాదించారు. సీబీఐ, ఈడీ తీరుపైనా సిబల్ విరుచుకుపడ్డారు. కేసు విచారణకు సంబంధించిన విషయాలను మీడియాకు లీక్ చేస్తూ చిదంబరం పేరు ప్రఖ్యాతులను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇక, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్స్‌లో కార్తీ చిదంబరం డైరెక్టర్‌గా గానీ, షేర్ హోల్డర్‌గా గానీ లేరని సిబల్ పేర్కొన్నారు. తండ్రి అధి కారాన్ని అడ్డుపెట్టుకొని కార్తీ చిదంబరం అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు. కార్తీ తమనెప్పుడూ సంప్రదించలేదని F.I.P.B అధికారులు చెప్పారని తెలి పారు. కార్తీ చిదంబరం అక్రమాలకు పాల్పడినట్లు ఛార్జ్‌షీట్ ఫైల్ కాలేదని, ఈ కేసులో ఇతర నిందితులంతా బెయిల్‌పైనే ఉన్నారని వాదించారు. సిబల్ బృందం వాదనలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు. INX కుంభకోణంతో చిదంబరం, కార్తీలకు సంబంధముందన్నారు. విచారణలో నిజాలు బయటపడతాయని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఇక, కస్టడీ పొడిగించడంతో సీబీఐ అధికారులు మరోసారి చిదంబరాన్ని ప్రశ్నించనున్నారు. ఆగస్టు 30 వరకు టైమ్ ఉండడంతో ఈసారి ఇంటరాగేషన్ స్టైల్‌ను మార్చనున్నా రు. అప్రూవర్‌గా మారిన ఇంద్రాణి ముఖర్జీని, చిదంబరాన్ని ఎదురెదురుగా పెట్టి ప్రశ్నించాలని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. INX స్కామ్‌లో చిదంబరం పాత్ర పై ఆధారాలను ఇంద్రాణినే ఇచ్చింది. కార్తీ చిదంబరాన్ని ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ కలిసిందో ఆమె పూసగుచ్చినట్లు వివరించింది. దాంతో, ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story