వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ

వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ

రాజధాని మార్పు మంత్రుల నుంచి వస్తున్న ప్రకటనలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. రోజుకో ప్రాజెక్టుకు మోకాలడ్డుతున్న ప్రభుత్వం.. ఏకంగా రాజధానిపైనే గందరగోళం సృష్టించటంతో రాజధాని ప్రాంత రైతులు, ప్రతిపక్ష పార్టీలు పోరాటం ఉద్ధృతం చేస్తున్నాయి. రాజధానిని మార్చితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ బీజేపీ..రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన బీజేపీ నేతలు..జగన్ ప్రభుత్వ విధానాలపై ఫైర్ అయ్యారు.

ముంపు ప్రమాదంతోనే అమరావతి మార్పు అంటూ సంకేతాలిచ్చినా మంత్రి బొత్సకు రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మహిళ సవాల్‌ విసిరింది. రాజధాని ప్రాంతం గతంలో ఎప్పుడైనా వరదలకు మునిగిందని నిరూపిస్తే.. తన మూడెకరాలు ఉచితంగా ఇస్తానంటూ ఛాలెంజ్ చేశారామె.

సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తారనుకున్నాం కానీ ఉన్న ప్రాజెక్టులను ఆపేందుకు ప్రయత్నించారని విమర్శించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. రైతుల ఆందోళన చూసైనా అమరావతి మార్పు ఆలోచనకు బొత్స తెరదించాలని సూచించారు సోమిరెడ్డి.

అటు కాంగ్రెస్ కూడా రాజధానిపై జగన్ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రికి రాజధానిపై అవగాహన ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు.

వామపక్షాలు సైతం అమరావతి బాట పడుతున్నాయి. సీఎం జగన్‌ స్పందించి గందరగోళానికి తెరదించాలని సీపీఎం నేత మధు డిమాండ్ చేసారు. రాజధానిలో వ్యవసాయ కూలీలకు పెన్షన్‌ రెండున్నర వేల నుంచి 5 వేలకు పెంచాలన్నారు. రైతుల కోసం పోరాటం చేస్తామని మధు స్పష్టంచేశారు.

మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారం రాజధాని రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. అమరావతిని మార్చవద్దంటూ రోడ్డెక్కుతున్నారు. అంతేకాదు.. రాజధాని రోడ్లపై సీఎం జగన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా నినాదాలు చేశారు.

రాజధాని ప్రాంత రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో ఆయనతో సమావేశం అయ్యారు. రాజధాని తరలిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. అయితే అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు వెంకయ్యనాయుడు.

Tags

Read MoreRead Less
Next Story