హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ లో హవాలా రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ లో మరోసారి హవాలా రాకెట్టు గుట్టురట్టైంది. ఈ సారి ఏకంగా అయిదు కోట్లు పట్టుబడ్డాయి. వీటిని రవాణా చేస్తూ చిక్కిన ముఠా అంతా గుజరాత్ కి చెందిన వారే.. పట్టుబడిన వారంతా ట్రాన్స్‌పోర్టర్లు అయితే.. అసలు సూత్రధారులు మాత్రం పత్తాలేకుండా పోయారు. సిటీలో పేరు మోసిన ఓ బడా వ్యాపారికి చెందిన ఈ సొత్తు ఎవరికి ఇవ్వనున్నారు... ఎంత మేర అందజేయనున్నారు అన్న విషయంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.

ముంబై, గుజరాత్ తర్వాత హైదరాబాద్‌లోనే ఎక్కువగా హవాలా వ్యాపారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ బిజినెస్ సిటీలో విపరీతంగా పెరిగిపోయింది. పోలీసులు అడపాదడపా దాడులు చేసిన సందర్భంలో ఏదో ఒక ప్రాంతంలో దాని గుట్టు బయటపడుతూనే ఉంది. పట్టుబడినప్పుడల్లా కోట్ల రూపాయలు వెలుగు చూసినా, ఈ ఇల్లీగల్ వ్యాపారానికి చెందిన బాసులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. గత ఎన్నికల సమయంలో కూడా పోలీసులు దాదాపు వంద కోట్ల రూపాయల హవాలా సొత్తును స్వాధీనం చేసుకున్నారంటే ఈ బిజినెస్ సిటీలో ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది. సాధారణంగా హవాలా వ్యాపారం అంటే బేగంబజార్ వైపే పోలీసుల చూపు ఉంటుంది. కానీ ఈ సారి ప్లేస్ మారింది. తమకు అందిన సమాచారంతో పోలీసులు జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద నిఘా పెట్టారు. హోండా యాక్టివా పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటకు పొక్కింది. గుజరాత్ కు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని 5 కోట్ల హవాలా సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ హవాల ముఠా వెనుక ఒక ప్రముఖ వ్యాపారి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story