తల్లికి వేరే దారి లేక కూతురిని..

తల్లికి వేరే దారి లేక కూతురిని..

కూతురు కాలేజీకి వెళ్తుంది కదా అనుకుంటే స్నేహితులతో పాటు తనూ డ్రగ్స్ తీసుకుంటుందన్న విషయాన్ని గుర్తించలేకపోయింది ఆ తల్లి. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన కూతురిని ఎలా మాన్పించాలో అర్థం కాక ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. బిడ్డ భవిష్యత్ కోసం ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. పంజాబ్ అమృత్‌సర్‌కు చెందిన యువతి డ్రగ్స్‌కి బానిస అయింది. దీంతో ఆవేదన చెందిన తల్లి.. కుమార్తెను పలు మార్లు డీ అడిక్షన్ సెంటర్‌కు తీసుకెళ్లింది. వారు నాలుగైదు రోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. అప్పుడే ఎలా మానేస్తారండి.. ఇంకొన్ని రోజులు చికిత్స అందించండి అన్నా వినకుండా ట్రీట్‌మెంట్ అయిపోయిందన్నారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి యధామామూలే. మత్తుమందు కోసం యువతి ఆరాటం. ఇవ్వకపోతే పిచ్చిగా అరవడం. దీంతో మరో మార్గం కనిపించలేదు తల్లికి.

ఏం చేయాలో అర్థం కాని తల్లి వేరే దారి లేక కూతురిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఇనుప గొలుసులతో ఇంట్లోనే బంధించింది. ఇరుగు పొరుగు ద్వారా విషయం సోషల్ మీడియాకు ఎక్కింది. ఇది తెలిసి అమృత్‌సర్ కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా యువతి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. యువతికి అవసరమైన చికిత్స అందించేందుకు డాక్టర్లను ఇంటివద్దకే పిలిపించి వైద్యం చేయిస్తామని తెలిపారు. కాగా, పంజాబ్‌లో మత్తు పదార్థాలకు బానిస అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. డీ అడిక్షన్ సెంటర్‌ కూడా అక్కడ ఒక్కటే ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 28వేల మందిని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారుల సాయంతో అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story