అలా చేయడం వైసీపీ వేధింపులకు పరాకాష్ట - చంద్రబాబు

అలా చేయడం వైసీపీ వేధింపులకు పరాకాష్ట - చంద్రబాబు

టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ రోజు ఎమ్మెల్యే కరణం బలరాంపై తప్పుడు కేసు పెట్టారు. నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసులు పెట్టారు. మొన్న కూన రవికుమార్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఆముదాల వలసలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని మండిపడ్డారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాత కేసులు తవ్వడం వైసీపీ వేధింపులకు పరాకాష్ట అన్నారు టీడీపీ అధినేత. గతంలో గాలి జనార్దన్ రెడ్డి చేసిన మైనింగ్ దోపిడీపై పోరాడితే.. ఇప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. వందలాది మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రశ్నించే హక్కు కాలరాయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంలా చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు గతంలో ఎప్పడు చూడలేదన్నారు చంద్రబాబు.

వైసీపీ నేతలు ఇప్పటికైనా అరాచకాలను మానుకోవాలని సూచించారు టీడీపీ అధినేత. మొత్తం పోలీస్ వ్యవస్థనే నిస్సహాయంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే నిస్సహాయంగా మారితే ఇక రక్షణ ఎవరు? అని ప్రశ్నించారు. వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని అన్నారు. సెప్టెంబర్ 3నుంచి గుంటూరులో వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరం ఏర్పాటు చేసి.. పల్నాడుతో సహా ఇతర ప్రాంతాల బాధితులు అందరికీ ఆశ్రయం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా శిబిరాల్లోనే బాధితులు ఉంటారని స్పష్టం చేశారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story