అంతా హైదరాబాద్‌లో ఖర్చు చేస్తున్నారు : చంద్రబాబు ఆవేదన

అంతా హైదరాబాద్‌లో ఖర్చు చేస్తున్నారు : చంద్రబాబు ఆవేదన

అమరావతిపై వైసీపీ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు తూర్పారబట్టారు. తెలుగు ప్రజలకు ఒక శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుడితే.. ఒక్క అవకాశం అంటూ మనుగడనే ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టుగా తాను రూపొందిస్తే.. సీఎం జగన్‌ అమరావతిని దెబ్బతీయడంతో.. అంతా హైదరాబాద్‌లో ఖర్చు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను మిగులు విద్యుత్ అందిస్తే.. మూడు నెలల పాలనలోనే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు.

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్ సాధించిన సింధు తెలుగు బిడ్డ కావడం గర్వకారణమన్నారు. పుల్లెల గోపీచంద్‌కు ఆనాడు గచ్చిబౌలిలో 5 ఎకరాల స్థలాన్ని అకాడమీకి ఇచ్చామని.. ఇప్పుడు అక్కడే మాణిక్యాలు తయారవుతున్నాయని గుర్తు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు చంద్రబాబు. తాను ఆశావాదినని.. ఎప్పుడూ అధైర్యపడనని అన్నారు. నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు టీడీపీకి అండగా ఉన్నారని గుర్తు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచి వచ్చిన టీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు తెలంగాణను పట్టించుకోవడం లేదన్న విమర్శలు సరికాదన్నారు. గతంలో దూరదృష్టితో ఆలోచించి కష్టపడి పనిచేశామని.. తాము తీసుకున్న నిర్ణయాలతోనే తన మానసపుత్రిక హైదరాబాద్‌ బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ పుంజుకునేలా చేస్తామని.. కార్యకర్తల నుంచే మళ్లీ నాయకులను తయారు చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story