రాష్ట్రంలో తగ్గిన లిక్కర్‌ వినియోగం..

రాష్ట్రంలో తగ్గిన లిక్కర్‌ వినియోగం..

ఏపీలో నిధుల కటకటతో సర్కార్‌ అప్రమత్తమైంది. వివిధ శాఖల్లో వసూళ్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం జగన్‌ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖలపై రివ్యూ చేశారు. తాజా పరిస్థితులపై విభాగాల వారీగా ఆయా శాఖల అధికారులను సీఎం ఆరా తీశారు. లోటుపాట్లపై చర్చించి.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలన్నారు సీఎం జగన్. స్మగ్లింగ్‌ జరగకుండా.. నాటు సారా తయారీ కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మద్యం తాగితే వచ్చే అనర్థాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలని చెప్పారు. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణనివ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని స్పష్టం చేశారు సీఎం జగన్.

అటు.. వివిధ శాఖల అధికారులు సీఎం దృష్టికి పలు అంశాలు తీసుకొచ్చారు. వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3 శాతానికి తగ్గిందని చెప్పారు. గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధిలేదని తెలిపారు. స్టీల్, ఇనుము, సిమెంటు రేట్లు తగ్గడం కూడా ఆదాయంపై ప్రభావం చూపుతోందని అన్నారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.అయితే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిహారం కింద సెప్టెంబర్ మొదటివారంలో 597 కోట్లు ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. ఇక రాష్ట్రంలో లిక్కర్‌ వినియోగం గణనీయంగా తగ్గిందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story